https://oktelugu.com/

MS Dhoni Jersey: నంబర్ 7 జెర్సీపై బీసీసీఐ కీలక నిర్ణయం.. సచిన్ తరువాత ధోనీకి అరుదైన గౌరవం..

భారత్ క్రికెట్‌లో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నంబర్ 10 జెర్సీకి చాలా ప్రాముఖ్యత ఉంది. జెర్సీ నంబర్ 10 అంటే సచిన్ గుర్తుకొస్తారు.

Written By: , Updated On : December 16, 2023 / 08:42 AM IST
MS Dhoni Jersey

MS Dhoni Jersey

Follow us on

MS Dhoni Jersey: టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోనీ అంటే ఇప్పటికీ క్రికెట్ అభిమానుల్లో యమక్రేజ్ ఉంటుంది. భారత్ జట్టు మైదానంలో క్లిష్ట సమయాల్లో ఉన్నప్పుడు క్రికెట్ వీక్షించేవారికి ఎంఎస్ ధోనీ గుర్తుకొస్తాడంటే అతిశయోక్తి లేదు. ధోనీ ఉంటేనా.. అతని కెప్టెన్సీ మాయాజాలంతో మ్యాచ్ భారత్ వైపుకు తిప్పేవాడు అంటూ మ్యాచ్ వీక్షించే వారు. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ఇచ్చిన ధోనీ ఐపీఎల్‌లో తన కెప్టెన్సీ, బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రేమికులను అలరిస్తున్నాడు. తాజాగా బీసీసీఐ మహేంద్ర సింగ్ ధోనీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

ధోని జర్సీ రిటైర్‌..
భారత్ క్రికెట్‌లో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నంబర్ 10 జెర్సీకి చాలా ప్రాముఖ్యత ఉంది. జెర్సీ నంబర్ 10 అంటే సచిన్ గుర్తుకొస్తారు. జెర్సీ నంబర్‌ 7 అంటే మహేంద్ర సింగ్ ధోనీ గుర్తుకొస్తారు. సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ తరువాత అతని జెర్సీ నంబర్ 10కి బీసీసీఐ రిటైర్మెంట్ ప్రకటించింది. సచిన్ పై ఉన్న గౌరవంతో భవిష్యత్‌లో ఏ భారత క్రికెటర్‌కు ఆ జెర్సీ నంబర్ కేటాయించబోమని బీసీసీఐ అప్పట్లో ప్రకటించింది. తాజాగా ధోని ధరించిన ఐకానిక్ నంబర్ 7 జెర్సీని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు రిటైర్ చేసింది. సచిన్ టెండూల్కర్ తర్వాత బీసీసీఐ తన జెర్సీని రిటైర్ చేసిన రెండో ఆటగాడిగా ధోనీ నిలిచాడు. ధోనీ క్రీడకు అందించిన సేవలను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ అతని జెర్సీని రిటైర్ చేయాలని నిర్ణయించుకున్నట్లు బీసీసీఐ తెలిసింది. నంబర్ 7 జెర్సీని ఏ ఆటగాడు ఉపయోగించడానికి అందుబాటులో ఉండదు.

మాజీ క్రికెటర్ల సూచన..
సచిన్ జెర్సీ నంబర్ 10కి రిటైర్మెంట్ ఇచ్చినట్లుగానే.. ధోనీ జెర్సీ నంబర్ 7కు రిటైర్మెంట్ ఇవ్వాలని పలువురు మాజీ క్రికెటర్లు గతంలో బీసీసీఐకి సూచించారు. ధోనీ అభిమానుల నుంచి కూడా తరచూ ఇలాంటి డిమాండ్ వినిపిస్తోంది. తాజాగా బీసీసీఐ ధోనీకి అరుదైన గౌరవాన్ని కట్టబెట్టింది. ధోనీ జెర్సీ నంబర్ 7 రిటైర్ అవుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

అద్భుతాలు సృష్టించిన ధోనీ..
క్రికెట్‌లో దిగ్గజం ధోని ఆటగాడిగా, కెప్టెన్‌గా అద్భుతమైన రికార్డులు సృష్టించాడు. భారత జట్టు సారథిగా, అతను అన్ని ప్రధాన ఐసీసీ ట్రోఫీలలో తన జట్టును విజయపథంలో నడిపించాడు. 2007 టీ20 ప్రపంచ కప్, 2011లో వన్డే ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని గెలిపించాడు. భారత్ తరఫున 350 వన్డే మ్యాచ్‌లు ఆడిన ధోని 50.57 సగటుతో 10,773 పరుగులు చేశాడు. అందులో 10 సెంచరీలు, 73 అర్ధ సెంచరీలు చేశాడు. టీ20లలో 98 మ్యాచులు ఆడి 1617 పరుగులు చేశాడు. 97 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 4,876 పరుగులు చేశాడు. ఆరు సెంచరీలు, 33 అర్ధసెంచరీలు కొట్టాడు. అదే సమయంలో వికెట్ కీపర్‌గా 294 అవుట్‌లను చేశాడు.