
బీహార్ అసెంబ్లీకి ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ), జనతా దళ్ (యునైటెడ్)(జేడీయూ) పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని బీహార్‌లోని వైశాలి జిల్లాలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆర్జేడీ నాయకుడు తేజ్ ప్రతాప్ యాదవ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తేజ్ ప్రతాప్ యాదవ్ మాట్లాడుతూ..2020లో ఎవర్ని వధిస్తారు? (2020 మే కిస్‌కా వధ్ హోగా?) అని ఆయన ప్రశ్నించారు. తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రశ్నకు స్పందించిన ప్రజలు.. నితీష్‌ను అని బదులిచ్చారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం నితీష్ కుమార్ ఓడిపోవడం ఖాయమన్నారు.
కంసుని వధించినట్టే ప్రజలు ఈసారి నితీష్‌ను ఓడిస్తారని ప్రతాప్ యాదవ్ పేర్కొన్నారు. ఆర్జేడీ కార్యకర్తలు, మద్దతుదారులు నిబద్దతతో పని చేస్తున్నారని తెలిపారు. అంతకుముందు ఇదే వేడుకలో తేజ్ ప్రతాప్ యాదవ్ వేణుగానం చేసి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు.
తేజ్ పరమ శివుడి భక్తుడు. గతంలో శివుని అవతారంలో తేజ్ ప్రతాప్ దర్శనమిచ్చారు. శివుని మాదిరిగా నడుముకు పులి చర్మం తరహా వస్త్రాన్ని చుట్టుకున్నారు. ఈ వేషధారణతోనే శివభక్తులతో పాటు ఆయన ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా తేజ్‌ప్రతాప్ రెండుసార్లు శంఖం పూరించారు. కాగా గతంలో తేజ్ ప్రతాప్ కృష్ణుడి వేషధారణతోనూ పూజలు నిర్వహంచి అందరినీ ఆకట్టుకున్నారు.