Homeజాతీయ వార్తలుNTR - KCR : జనం ఓడించారు.. ‘అన్నా’.. అంటూ కేసీఆర్‌ కన్నీరు పెట్టాడు

NTR – KCR : జనం ఓడించారు.. ‘అన్నా’.. అంటూ కేసీఆర్‌ కన్నీరు పెట్టాడు

NTR – KCR : ఇప్పుడంటే కేసీఆర్ తెలంగాణ ముఖ్య మంత్రి. జాతీయ స్థాయిలో చక్రాలు తిప్పాలనుకుంటున్న బీఆర్ఎస్ కు అధిపతి. అత్యంత సిరి సంపదలతో తులతూగుతున్న రాజకీయ పార్టీకి దళపతి. కానీ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు. అసలు తన రాజకీయ జీవితాన్ని ఆ పార్టీ నుంచి ప్రారంభించాడు. అంతేకాదు తన కొడుకుకు ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నాడు. అంతటి కేసిఆర్ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కన్నీరు పెట్టాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మీరూ చదివేయండి

1983 ఎన్నికల్లో..
1983లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం తరపున ఎన్టీఆర్‌ టికెట్‌ ఇచ్చిన ప్రస్తుత తెలంగాణ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరూ ఓడిపోయారు. ఈ ఇద్దరి ఓటమికి ఒకటే కారణం.. ఎన్టీఆర్‌ వారిద్దరి ప్రచారం కోసం సిద్దిపేట, సత్తుపల్లి నియోజకవర్గాలకు వెళ్లలేకపోవడమే. 1983 జనవరి 3 ఎన్నికల ప్రచారానికి చివరి తేదీ. షెడ్యూలు ప్రకారం ఎన్టీఆర్‌ 1982 డిసెంబర్‌ 31న ఆదిలాబాద్‌ జిల్లా చెన్నూరు నియోజకవర్గానికి ప్రచారానికి వెళ్లాలి. అయితే ఆ సీటును సంజయ్‌ విచార్‌ మంచ్‌కు కేటాయించడంతో మేనకాగాంధీతో కలిసి, ఎన్టీఆర్‌ ఆక్కడ ప్రచారంలో పాల్గొన్నారు. అప్పటికే జ్వరంతో ఉన్న ఎన్టీఆర్‌ ఎక్కడా ప్రచారాన్ని ఆపలేదు. ఆ తర్వాత సిద్దిపేటలో ప్రచారం చేయాల్సి ఉంది. అదే సమయంలో ఎన్టీఆర్‌కు తాను పోటీచేస్తున్న గుడివాడ, తిరుపతి గుర్తొచ్చాయి. చైతన్యరథం మీద వెళ్తే ఆ రెండు ప్రాంతాలకూ వెళ్లలేమని పక్కన ఉన్నవారు చెప్పారు. దీంతో ఎవరికీ కనిపించకుండా.. ఆయన రహస్యంగా ఒక కారులో బయలుదేరారు. ఆ కారు సిద్దిపేట చేరుకునే సరికి తెల్లవారుజామున రెండున్నరైంది. ఒక వ్యక్తి కారును ఆపారు. రోడ్డును ఆనుకుని ఒక వేదిక.. అక్కడ 200 మంది గుంపుగా ఉన్నారు. ఆ కారును ఆపిన వ్యక్తి ‘ఎన్టీఆర్‌ ఎక్కడున్నారో మీకు తెలుసా అని డ్రైవర్‌ను అడిగారు. ఇంతలో ఆ గొంతును గుర్తుపట్టిన ఎన్టీఆర్‌.. ‘చంద్రశేఖర్‌’ అని పిలిచారు. ఎన్టీఆర్‌ పిలుపును గుర్తించిన కేసీఆర్‌.. ‘అన్నా మీరొస్తున్నారని, లక్షమంది పోగయ్యారు. అయిదారు గంటల ముందువస్తే గ్యారెంటీగా గెలిచేవాణ్ని, ఇప్పుడు అంతా అయిపోయింది’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.  ఆ తరువాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 1985లో కేసీఆర్‌ సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం 1987 మంత్రివర్గంలో స్థానం సంపాదించారు.
తుమ్మల నాగేశ్వరరావు ది అదే పరిస్థితి
ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన తుమ్మల నాగేశ్వరరావుది ఇదే పరిస్థితి. తన ఎన్నికల ప్రచారానికి ఎన్టీఆర్‌ వస్తే గెలుపు ఖాయమనే ధీమాలో తుమ్మల ఉన్నారు. ఎన్టీఆర్‌ కూడా వస్తానని మాటిచ్చారు. కానీ గుడివాడ, తిరుపతిలో ఎన్టీఆరే పోటిచేయడం, తిరుపతిలో ప్రచారం ముగింపు కార్యక్రమం ఉండడంతో సత్తుపల్లిలో ప్రచారానికి రాలేకపోయారు. ఆ ఎన్నికల్లో తుమ్మల ఓడిపోయారు. ఈ విషయాన్ని గుర్తుంచుకున్న ఎన్టీఆర్‌ తుమ్మలకు ఎమ్మెల్సీ ఇవ్వాలని నిర్ణయించారు. కానీ ‘నేను ఎమ్మెల్యేగానే గెలిచి వస్తాను’ అని తుమ్మల ఎన్టీఆర్‌కు చెప్పారు. ఆ తరువాతి రాజకీయ పరిణామాలతో మళ్లీ ఎన్నికలు వచ్చాయి. అపుడు తుమ్మల నామినేషన్‌ వేసేందుకు ఎన్టీఆర్‌ ‘బి ఫామ్‌’ అందిస్తూ ‘ఈసారి సత్తుపల్లి ప్రచారానికి వస్తా.. మీరు గెలుస్తున్నారు’ అని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్‌ అన్నట్టుగానే టీడీపీ అధికారంలోకి వచ్చింది. సత్తుపల్లిలోనూ టీడీపీ జెండా ఎగిరింది. తర్వాత తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా గెలిచారు. చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ శాఖలో తనదైన మార్కు ప్రదర్శించి పలు నీటి ప్రాజెక్టులు నిర్మించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ క్యాబినెట్లో రోడ్డు భవనాల శాఖ నిర్వహించారు. 2018 లో జరిగిన ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.
Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular