Pelican Signals హైదరాబాద్ లాంటి మహానగరంలో అన్నింటికంటే పెద్ద టాస్క్ ఏంటో తెలుసా? అత్యంత రద్దీ ఉండే రహదారులపై రోడ్డు దాటడం.. వృద్ధులు, చిన్న పిల్లలే కాదు.. యువకులు కూడా రోడ్డు దాటడం తలకుమించిన భారం అవుతోంది. 60కి.మీలకు పైగా దూసుకొచ్చే వాహనాలను తప్పించుకుంటూ రోడ్డు దాటడం అంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఒక సాహసం చేయడమే అవుతోంది. అత్యవసరంగా దాటాలనుకుంటే ఇక ఒక యుద్ధం చేసిన పనే అవుతోంది. ఇలా దాటుతుండగా..వాహనాలు ఢీకొని చాలా మంది చనిపోతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా స్కూళ్లు, కాలేజీలు, హాస్పిటల్స్, రద్దీకూడళ్లు, ప్రధాన రహదారుల వద్ద అత్యవసరంగా దాటాల్సిన పరిస్థితుల్లో ప్రమాదాల బారినపడుతున్నారు. ఇందుకు పరిష్కారంగా జీహెచ్ఎంసీ ఆధునిక టెక్నాలజీతో తీసుకొచ్చిందే ‘పెలికాన్ సిగ్నల్స్’. వీటి వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు తప్పనుంది. అసలేంటి ‘పెలికాన్ సిగ్నల్స్’? ఇవి ఎలా పనిచేస్తాయి.? పాదచారులకు ఎలాంటి లాభం అన్న దానిపై స్పెషల్ ఫోకస్.

హైదరాబాద్ లాంటి మహానగరంలో వాహనాల రద్దీని తట్టుకొని రోడ్డు దాటాలంటే చాలా కష్టపడాల్సిందే. ఇక పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులైతే రోడ్డు దాటాలంటే కష్టపడాల్సి వస్తోంది. అందుకే ప్రధాన రహదారులను సురక్షితంగా తీర్చిదిద్దడానికి విదేశాల్లోని సిగ్నల్స్ వద్ద వినియోగించే ‘పెలికాన్ సిగ్నల్స్’ను తాజాగా హైదరాబాద్ లో ప్రవేశపెట్టారు. దీని వల్ల వీరంతా రహదారి దాటేటప్పుడు సురక్షితంగా వెళ్లవచ్చు.
భద్రత, ప్రమాదాల నివారణ కోసం జీహెచ్ఎంసీ నగరంలో పాదచారుల సిగ్నల్స్‌ను కూడా ఏర్పాటు చేసింది. వాహనదారులు సురక్షితంగా ప్రయాణించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇప్పటి వరకు 334 ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు.

-అసలు ఏంటి ‘పెలికాన్ సిగ్నల్స్’?
పాదచారులు క్షేమంగా రోడ్డు దాటేందుకు కూడలి పై ఈ పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తారు. రోడ్డుకు ఇరువైపులా ‘స్విచ్ బోర్డులను’ ఏర్పాటు చేస్తారు. పాదచారులు అర్జంట్ గా రోడ్డుగా దాటాలనుకుంటే వాటిపై ఉండే మీట నొక్కితే రెడ్ సిగ్నల్ పడుతుంది. అధికారులు నిర్ధేశించిన 15 సెకన్లు, లేదా 30 సెకన్లు పూర్తయ్యే వరకూ రెడ్ లైట్ ఉంటుంది. దీంతో వాహనాలన్నీ రోడ్డుకు అటువైపే ఆగిపోతాయి. ఆ సమయంలో పాదచారులు సాఫీగా రోడ్డు అవతలికి చేరుకోవచ్చు. అనంతరం కొద్ది సమయం పాటు మీట నొక్కినా లైట్ వెలగదు. ఆసమయంలో వాహనాలు వెళ్లిపోతాయి. ఈ ‘పెలికాన్’ సిగ్నల్స్ వల్ల ఇటు వాహనదారులకు, ఇటు పాదచారులకు ఇద్దరికీ ఉపయోగకరంగా ఉంది. ఈ ఆధునిక సాంకేతికతతో ఇవి పనిచేస్తాయి.
నగరంలో 94 పెలికాన్ పేడే స్ట్రెయిన్ సిగ్నల్స్ లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 68 సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. మిగిలినవి పోలీసు శాఖ నుంచి ప్రతిపాదనలు రాగానే లక్ష్యం మేరకు పూర్తి చేయనున్నారు.