Peddireddy Ramachandra Reddy: ఏపీ క్యాబినెట్ డమ్మీ నా? కొందరు మంత్రుల తీరుపై సొంత పార్టీలోనే అసంతృప్తి ఉందా? సహచర మంత్రుల తీరుపైనా సీనియర్లకు ఆగ్రహం ఉందా? వారు హుందాగా వ్యవహరించడం లేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీడియో వైరల్ అవుతోంది. తాను మంత్రి అంబటిలా మాట్లాడలేనంటూ పెద్దిరెడ్డి సెటైరికల్ గా వ్యాఖ్యానించడం విశేషం.
ఏపీ క్యాబినెట్ లో ఉన్న చాలామంది మంత్రులు.. తమ శాఖల కంటే రాజకీయ విమర్శలకే ప్రాధాన్యం ఇస్తారు. అయితే కొందరు జూనియర్ మంత్రులు అతిగా ప్రవర్తిస్తారన్న అపవాదును మూట కట్టుకున్నారు. రోజా, గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు, జోగి రమేష్, సిదిరి అప్పలరాజు వంటి మంత్రులు నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. కానీ సీనియర్ మంత్రులుగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణలు వీలైనంతవరకు వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉంటారు. రాజకీయ, విధానపరమైన అంశాలపైనే మాట్లాడతారు. రాజకీయంగా మాత్రం సీనియర్ మంత్రులు విశేష ప్రభావం చూపగలరు. వీరికి వ్యక్తిగతంగా సైతం ప్రజల్లో పలుకుబడి ఉంది. కానీ జూనియర్లు మాత్రం పార్టీతో పాటు అధినేత ప్రభావంతో మాత్రమే రాణించగలరు. అందుకే వారు అధినేతను ఆకట్టుకోవడానికి రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలు చేస్తుంటారు. సీనియర్లకు ఆ అవసరం ఉండదు.
చంద్రబాబు అరెస్టు తరువాత తన క్యాంపు కార్యాలయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. రాజకీయాల్లో హుందాతనం పై మాట్లాడారు. ” నేను దూకుడుగా వ్యవహరించలేను. నా పరిమితికి మించి మాట్లాడలేను. పరిమితికి లోబడే మాట్లాడతాను. మా పార్టీకి చెందిన మంత్రి అంబటిలా కామెంట్స్ చేయలేను” అంటూ పెద్దిరెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజకీయ హుందాతనంపై చర్చ జరుగుతోంది. నెటిజన్లు సైతం అంబటి రాంబాబు పై కామెంట్స్ చేస్తున్నారు. అటు వైసీపీలో మాత్రం వివాదానికి ఆజ్యం పోసేలా ఈ వీడియో ఉంది.