Happiness in TDP Cadre : టీడీపీలో జోష్ నెలకొంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఆ పార్టీలో గెలుపు ధీమా తొణికిసలాడుతోంది. అటు పార్టీ శ్రేణులు సైతం రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నాయి. అయితే ఇందుకు పవన్ కళ్యాణే కారణం కావడం గమనార్హం. రెండు రోజుల కిందట పవన్ చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే. ఆ కలయిక పొత్తుల అంశం తేల్చుకునేందుకేనన్న కామెంట్స్ వినిపించాయి. అయితే దీనిపై క్లారిటీ లేకున్నా టీడీపీలో ఉన్న అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. ఇక జనసేన తమతో కలిసి వస్తుందన్న ధీమా ప్రారంభమైంది. చాలా రోజులుగా టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తాయని ప్రచారం ఉంది. అయితే ఇటీవల కొన్ని పరిణామాలు రెండు పార్టీల కలయికపై ప్రశ్నార్థకంగా నిలిచాయి. కానీ అవన్నీ ఉత్తవేనని చంద్రబాబు, పవన్ ల తాజా కలయికతో తేలిపోయింది.
ఆ అనుమానంలో టీడీపీ..
కొద్దిరోజుల కిందట పవన్ ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసిన సంగతి తెలిసిందే. దీంతో పవన్ స్ట్రాటజీ మారిందని.. టీడీపీని వదిలి బీజేపీతోనే కొనసాగుతారని ప్రచారం సాగింది. ఇటీవల వైసీపీ నేతలు సైతం ఓరకమైన ప్రచారం మొదలుపెట్టారు. చంద్రబాబు పవన్ ను వదిలించుకునే ప్రయత్నంలో ఉన్నారని ఆరోపణలు చేశారు. ఎన్టీఆర్ జయంతి వేడుకలకు రజనీకాంత్ హాజరై చంద్రబాబుకు అనుకూలంగా చేసిన వ్యాఖ్యలతో మాజీ మంత్రి కొడాలి నాని వంటి వారు విపరీత వ్యాఖ్యానాలు చేశారు. తమిళనాడులో హీరో.. ఇక్కడ జీరో అయిన రజనీకాంత్ ను లైన్ లోకి తెచ్చి.. పవన్ ను పక్కనపెట్టే పనిలో చంద్రబాబు ఉన్నారని ఆరోపణలు చేశారు. అయితే అది జరిగి ఒక రోజు జరగక ముందే చంద్రబాబు ఇంటికి పవన్ స్వయంగా రావడంతో అధికార పార్టీకి మింగుడుపడడం లేదు.
తేనీటి విందుతో హీట్..
చంద్రబాబు, పవన్ ల ఏకంతా భేటీ మాత్రం పొలిటికల్ సర్కిల్ లో సెగలు రేపుతోంది. ముఖ్యంగా వైసీపీకి ఏం జరుగుతుందో అంతుపట్టడం లేదు. అయితే కేవలం తేనీటి విందుతో ఇద్దరు నేతలు హీట్ పెంచారు. అయితే అంతకంటే ముందు సొంత పార్టీల్లో గందరగోళం, అయోమయం దూరం చేసేందుకే కొత్త ఎత్తుగడ వేసినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రెండు పార్టీల శ్రేణులకు పోత్తు ఉంటుందని సంకేతాలు పంపడానికే భేటీ అయ్యారని.. సానుకూల వాతావరణం కల్పించేందుకే వారు ఉన్నపలంగా భేటీ కావాల్సి వచ్చిందని చెబుతున్నారు. అదే సమయంలో మీడియాతో మాట్లాడకుండా భేటీ మరింత చర్చకు రావాలన్న ఉద్దేశ్యంతో వ్యూహాత్మకంగా ఇరువురు నేతలు వ్యవహరించారన్నకామెంట్స్ వినిపిస్తున్నాయి.
యువగళంలో జనసేన జెండాలు
అయితే పవన్ అకాల రాక టీడీపీలో ఆనందానికి కారణమవుతోంది. లోకేష్ చేపడుతున్న యువగళం పాదయాత్రలో అటు టీడీపీ, ఇటు జనసేన జెండాలు సంయుక్తంగా కనిపిస్తున్నాయి. లోకేష్ పాదయాత్రకు మేము సైతం అంటూ జనసేన శ్రేణులు వచ్చి సంఘీభావం తెలుపుతున్నాయి. అయితే ఇరువురు నేతల భేటీకి ఇరు పార్టీ మెజార్టీ శ్రేణులు స్వాగతం చెబుతున్నాయి. ఇక నుంచి ఆ రెండు పార్టీల సభలు, సమావేశాల్లో అటు జనసేన, ఇటు టీడీపీ జెండాలు కనిపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే కొత్తగా పసుపు సైనికుల్లో ఆనందం తొణికిసలాడేందుకు పవన్ కారణం కావడం గర్వంగా ఉందని జన సైనికులు చెబుతున్నారు.