Choreographer Chaitanya Mother: యంగ్ కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్యను తల్లిదండ్రులు, సన్నిహితులు జీర్ణించుకోలేకున్నారు ఇంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నాడని వాపోతున్నారు. చైతన్య తల్లి లక్ష్మీ రాజ్యం ఆవేదన వర్ణనాతీతం. అప్పుల గురించి నాకు గానీ, స్నేహితులకు గానీ చైతన్య ఎందుకు చెప్పలేదని కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి 15 నిమిషాల ముందు చైతన్య నాతో మాట్లాడాడు. సన్మాన కార్యక్రమంలో కూడా డల్ గా కనిపించావు, పెద్ద పెద్ద వాళ్ళు నీకు సన్మానం చేస్తున్నారు. వాళ్లతో పరిచయాలు పెంచుకో అని చెప్పాను. అప్పుల బాధతో నా కొడుకు చనిపోయాడని నేను అనుకోవడం లేదని ఆమె అన్నారు.
అంతకు ముందుకు గుడికి వెళదాం ఇంటికిరా అన్నాను. నాకు కూడా చిరాగ్గా ఉంది. ప్లాన్ చెయ్ అమ్మా, గుడికి వెళదాం అన్నాడు. ఒక్కోసారి ఇంటికి రాకపోతే నేను చచ్చిపోతా అని బెదిరించేదాన్ని. నువ్వు చనిపోతే నన్నెవరు చూస్తారమ్మా… నేను కూడా చనిపోతా నీ పక్కన ఒక బెర్త్ కన్ఫర్మ్ చెయ్ అనేవాడు. ఇప్పుడు ఒక్కడే చనిపోయాడు. చనిపోదాం అంటే నేను కూడా వచ్చే దాన్ని కదా… అంటూ తల్లి లక్ష్మీ రాజ్యం ఆవేదన చెందారు.
డబ్బు కాదు ఆరోగ్యం ముఖ్యమని చెబుతూ ఉండేవాడు. అలాంటిది డబ్బుల కోసం ఆత్మహత్య చేసుకున్నాడు అంటున్నారు. ఆ డబ్బులు అడిగితే నేను ఇవ్వనా? వాడి కంటే నాకు డబ్బులు ముఖ్యమా? అప్పుల గురించి చెబితే నేను ఏదో ఒకటి చేసి ఇచ్చేదాన్ని కదా. నన్ను అన్యాయం చేసి పోయాడు. వాడే నా ప్రాణం. వాడు చేసిన పనికి నాకు ఏడుపు కూడా రావడం లేదు. ఇంత ద్రోహం చేశాడు… అంటూ గుండెలు పగిలేలా ఆమె ఆవేదన చెందారు.
డాన్స్ డే సందర్భంగా చైతన్యను నెల్లూరు క్లబ్ హోటల్ లో సన్మానించారు. అదే హోటల్ లో నిన్న ఉదయం చైతన్య ఆత్మహత్య చేసుకున్నాడు. చైతన్య ఉన్న రూమ్ డోర్ బద్దలు కొట్టి లోపలి వెళ్లి చూశారు. ఫ్యాన్ కి వేలాడుతున్న చైతన్యను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నెల్లూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో చైతన్యకు పోస్టుమార్టం నిర్వహించారు. హైదరాబాద్ నుండి చైతన్య మిత్రులు పదుల సంఖ్యలో ఏరియా ఆసుపత్రికి చేరుకున్నారు.