Pawan Kalyan vs Jagan: ఏపీలో ప్రశ్నిస్తే తట్టుకోలేరు. సమస్యలపై నిలదీస్తే సహించలేరు. వైఫల్యాలను ఎండగడితే రగిలిపోతారు.. గత మూడున్నరేళ్లుగా ఇదే సీన్. ఈ మూడు అంశాల్లో దూకుడుగా ఉన్నందుకు కాబోలు పవన్ అంటే అధికార వైసీపీకి గిట్టదు. ఆయన వ్యక్తిత్వంపై దాడిచేస్తారు. ఆయన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తారు. ఆయన వృత్తి, ప్రవృత్తిని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తారు. మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడతారు. దిగువ శ్రేణి నాయకుల నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులది అదే బాట. అధినాయకుడు కూడా నా ఈ.. పీకలేరు అంటూ వారికి మరింత ప్రామ్టింగ్ ఇస్తుంటారు. సోషల్ మీడియా, నీలి మీడియా, కూలి మీడియా, కుహానా మేధావులకు సైతం పవన్ నామ జపం తప్పించి ఇంకో మాట దొరకదు. చివరకు పవన్ ముచ్చటపడి రూ. కోటి పెట్టి రూపొందించుకున్న వాహనాన్నిసైతం విడిచిపెట్టలేదు. ఇరుకున పెట్టాలని చూసి ‘ప్రచార రథాని’కే ప్రచారం కల్పించిన ఘనాపాటీలు వారు.

ఇప్పుడు పవన్ హాలీడే పాలిటిక్స్ అంటూ కొత్తట్రిక్స్ మొదలుపెట్టారు. షూటింగ్ లకు హాలీడేస్ ఇస్తే తప్ప పవన్ ప్రజల ముఖం చూడడం లేదని వక్రభాష్యం చెబుతున్నారు. నిజమే పవన్ కు తెలిసినదే సినిమాలు. ఆయన వృత్తే సినిమా. సినిమా తప్పించి మరో ఆదాయం లేదు. పరిశ్రమలు లేవు.. స్థిరాస్తులు లేవు. తండ్రి వారసత్వంగా రాజకీయాలు ఇవ్వలేదు.. పరిశ్రమలు ఇవ్వలేదు.. ఆదాయ మార్గాలు చూపలేదు. అటువంటప్పుడు పవన్ సినిమాలు చేసుకోవడం తప్పా? ఫుల్ టైమ్ రాజకీయాలు చేయడం లేదంటున్నారు. అది ముమ్మాటికీ నిజమే. దానిని ధైర్యంగా చాలా సందర్భాల్లో పవన్ ఒప్పుకున్నారు. తనకు రాజకీయాలంటే ఇష్టమని.. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపడమే సంతృప్తినిస్తుందని.. అయిష్టతగానే సినిమా రంగంలో కొనసాగుతున్నానని… సినిమాల్లో వచ్చిన ఆదాయంతోనే పార్టీని నడుపుతున్నానని.. చాలా నిజాయితీగా చెప్పారు. కోట్లాది మంది ప్రేక్షాకాభిమానం సొంతంచేసుకున్న పవన్ అంటే సినిమా రంగంలో కూడా క్రేజ్ ఉంది. ఆయనతో ఎప్పుడు సినిమాలు చేద్దామా? అని ఎదురుచూసే నిర్మాతలు ఉన్నారు. తన క్రేజ్ తో పాటు ప్రతీ సినిమాకు కష్టపడి పనిచేస్తున్నారు. కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. కోట్ల రూపాయల ఆదాయపు పన్ను కడుతున్నారు. నాకు సినిమా తప్పించి మరో ఆదాయం లేదు అని చెబుతున్నా పవన్ ను విడిచిపెట్డం లేదు. చేస్తే సినిమాలు చేసుకో.. లేకుంటే పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చేయ్ అని సవాల్ చేస్తున్నారు.
జనసేన ఆవిర్భావం తరువాత తాను చేసిన సినిమాలు.. వచ్చిన ఆదాయం.. ప్రభుత్వానికి కట్టిన ఆదాయపు పన్నుపై పవన్ చాలాక్లారిటీతో మాట్లాడారు. పవన్ సినిమాల ద్వారా వచ్చిన ఆదాయంలోనే ఉభయ తెలుగు రాష్ట్రాల విపత్తుల నిధికి సాయమందించారు. ఆత్మహత్య చేసుకున్న 3,000 మంది కౌలు రైతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున సాయమందించారు. దేశంలో ఏ పార్టీ చేయని విధంగా కార్యకర్తల బీమా పథకానికి కోట్లాది రూపాయలు కేటాయించారు. ప్రభుత్వ బాధిత వర్గాల వారికి, అధికార పార్టీ కక్షలకు బలైన వారికి సాయం చేసి ఉదారతను చాటుకుంటున్నారు. మొన్నటికి మొన్న ఇప్పటం బాధితులు 43 మందికి రూ.43 లక్షలు అందించి స్వాంతన చేకూర్చారు. రెండేళ్ల కిందట నా బిడ్డ దారుణ హత్యకు గురైతే ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పిన శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు సుందరమ్మ ఆక్రందనలు చూసి రూ.లక్ష సాయాన్ని ఆన్ దీ స్పాట్ లో అందించారు.

ప్రజా వ్యతిరేక పాలనను చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి హాలీడేస్ ప్రకటించాలన్న పవన్ డిమాండ్ తో ఎదురుదాడికి దిగుతున్నారు. ఆక్వారంగానికి నిలిపివేసిన రాయితీలు పునరుద్ధరించాలని పవన్ వినతికి కూడా వక్రభాష్యం చెబుతున్నారు. అక్వారంగం ఆర్థికంగా ఉన్నతమైనదని.. దానికి రాయితీలతో పనిలేదని.. ఇలా డిమాండ్ చేయడం వెనుక అక్వా రంగాన్ని పార్టీ నిర్మాణానికి ఉపయోగించుకోవడమేనని పవన్ పై నీలిమీడియా ప్రచారం మొదలు పెట్టింది. ఏ అలవాటు ఉన్నవారు .. అందరికీ అవే అలవాట్లు ఉంటాయని భావిస్తుంటారు. అందుకే తమ అలవాటును జనసేనకు అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ వ్యవస్థాపకుడు కష్టం, శ్రమ, సంపాదనతో నడుస్తున్న పార్టీ జనసేన. ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో ఇలా సొంతంగా పార్టీ నడిపిన ఘనత ఒక్క పవన్ కే దక్కుతుంది. ఆ ఖ్యాతి కూడా దక్కకుండా విషం చిమ్మే ప్రయత్నమే ఇది. ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి క్రాప్ హాలీ డే ఇవ్వాలన్న పవన్ పిలుపుతో ఉలిక్కిపడిన వైసీపీ పేటీఎం బ్యాచ్.. పవన్ షూటింగ్ ల హాలీడేస్ నాయకుడంటూ కౌంటర్ ఇవ్వడం నీచం. ఒక వ్యక్తి వృత్తిని.. ప్రభుత్వ వైఫల్యాన్ని ఒకే గాడిలో కట్టడం బహుశా వైసీపీ నేతలకు తెలిసినట్టుగా మరెవరికీ తెలియదు. అయితే మనం చెప్పిన అబద్ధాలన్ని కొన్నిసార్లే నిజాలు అవుతాయి. కానీ మనం చెప్పే నిజాలు అంతిమంగా మంచి ఫలితాలు చేకూరుస్తాయి.అది గుర్తెరిగి మసులుకోవాల్సిన అవసరం వైసీపీ శ్రేణులకు ఉత్తమం.