
సుగాలి ప్రీతీ కేసును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ( సీబీఐ)కు అప్పగించడం పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. “జగన్ రెడ్డి గారి వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రతిఒక్కరిని పేరుపేరునా అభినందిస్తున్నాను..” అని పవన్ కళ్యాణ్ మీడియాకి తెలిపారు.
మూడేళ్ళ క్రితం కర్నూల్ లోని కట్టమంచి రామలింగా రెడ్డి పాఠశాలలో చదువుతున్న సుగాలి ప్రీతి లైంగిక దాడికి, ఆపై హత్య చేయబడిన ఘటనపై వారి కుంటుంభ సభ్యులకు ఇంతవరకు న్యాయం జరగలేదు. ఈ విషయం పై పవన్ స్పందిస్తూ.. ఆమె తల్లిదండ్రుల కడుపు కోత, ఆవేదన, ఆక్రందనను తాను స్వయంగా చూశానన్నారు. తన బిడ్డ కేసులో న్యాయం కోసం ఆమె తల్లిదండ్రులు పడిన కష్టం పగవాడికి సైతం రాకూడదన్నారు. అన్నారు. నడవలేని ప్రీతీ తల్లి చక్రాల కుర్చీలో మంగళగిరిలో జనసేన కార్యాలయానికి వచ్చినప్పుడు.. ఆమె చెప్పిన అమానుష సంఘటన గురించి విన్న తరువాత ఈ పరిస్థితి ఏ పసిపాపకూ రాకూడదని భావించానని పవన్ అన్నారు. ఆ సంకల్పంతోనే ఈ నెల 12న కర్నూలు వీధులలో సుగాలి ప్రీతీ కేసులో న్యాయం కోసం నినదించానన్నారు. చివరికి ఆ బాలిక తల్లిదండ్రులకు ఇన్నాళ్లకు స్వాంతన కలిగిందన్నారు. ఈ పోరాటంలో అండగా ఉన్న కర్నూలు ప్రజానీకానికి, పాత్రికేయులకు, ప్రజా సంఘాలకు పవన్ అభినందనలు తెలిపారు పవన్.