చాలామంది పవన్ కళ్యాణ్‌ను పార్ట్‌టైమ్ రాజకీయ నాయకుడిగా విమర్శిస్తుంటారు. కానీ పవన్ లో ఖచ్చితంగా రాజకీయ చతురత ఉందని ఆయన అడుగులు చూస్తే అర్థమవుతోంది.. కేవలం ఒక ప్రకటనతో అతను శక్తివంతమైన వైఎస్ఆర్‌సిపి ప్రభుత్వాన్ని చాప మీద కింద నీరులా చుట్టేస్తున్న వైనం ఆసక్తి రేపుతోంది. జగన్ ను రక్షణాత్మకంగా వైఖరిలోకి పవన్ నెడుతున్నాడు. ఏపీలోని రోడ్ల పరిస్థితి సమస్యను పవన్ చాలా సరైన సమయంలో తీసుకున్నాడని.. ఇది ఏపీ ప్రజలను తీవ్రంగా వేధిస్తున్న సమస్య అని క్షేత్రస్థాయి నుంచి వినిపిస్తోంది. ఏపీ రాజకీయాలు ప్రస్తుతం పవన్ తీసుకున్న స్టెప్ తో బాధిత ప్రజలంతా వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఏపీలో రోడ్డ దుస్థితిపై ఉద్యమాలు మొదలయ్యాయంటే అది పవన్ ఘనతే అంటున్నారు.
నేడు ఏపీలో రాజకీయాలు ‘రోడ్ల’మీదనే నడుస్తున్నాయి. రోడ్ల పరిస్థితిపై పోరాటానికి జనసేన నాయకత్వం వహిస్తోంది. రెండేళ్ల వరకు రాష్ట్రాన్ని పాలించిన టిడిపి ఈ విషయంలో మౌనంగా ఉండడం గమనార్హం. రెండేళ్ల క్రితం రోడ్లపై ఆందోళన చేసిన వైఎస్ఆర్‌సిపి ఇప్పుడు రోడ్ల పరిస్థితిపై కిక్కురుమనకుండా ఉండడం అందరినీ షాక్ కు గురిచేస్తోంది. పవన్ కొడుతున్న ఈ దెబ్బకు ప్రభుత్వం రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయడానికి రెడీ అయ్యిందన్న సమాచారం లీక్ అయ్యింది.
జనసేన రోడ్ల టాపిక్ తీసుకోగానే వైసీపీ అలెర్ట్ అయ్యింది. రోడ్లు మరమ్మతు చేయబడే ఖచ్చితమైన ప్రాంతాలను గుర్తించే పనిలో ప్రభుత్వం పడింది. వైసీపీ సర్కార్ హడావుడిగా రోడ్లకు మరమ్మతులు ప్రారంభించింది.
ఇప్పుడు పవన్ కల్యాణ్ తన ఆందోళన కారణంగానే ప్రభుత్వం మరమ్మతులు చేపట్టిందని ఘనంగా చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఇది జనసేన విజయంగానే చెప్పొచ్చు. ఆసక్తికరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితిపై టిడిపి తన స్వరాన్ని ఇప్పుడు పెంచుతోంది. కానీ టైం లేట్ అయిపోయింది. క్రెడిట్ మొత్తం జనసేనకే వచ్చేస్తోంది. వైఎస్ఆర్‌సిపి ప్రభుత్వం రాక ముందే రోడ్ల పరిస్థితి దిగజారిందని మంత్రులు ఆరోపిస్తున్నారు. టిడిపికి వైయస్‌ఆర్‌సీపీ కౌంటర్ ఇవ్వడంతో ఈ పాపంలో టీడీపీలోనూ భాగముందని ఆరోపణలు వస్తున్నాయి. ఇది టీడీపీని డిఫెన్స్‌లో పడేసింది. రోడ్ల దుస్థితి సద్వినియోగం చేసుకొని జనసేన ముందుకి వచ్చి క్రెడిట్‌ను కొట్టేసింది.