‘‘హుజూరాబాద్ లో బీజేపీ తరుఫున ఈటల రాజేందర్ కాకుండా ఆయన భార్య ఈటల జమున నామినేషన్ దాఖలు’’ ఈ వార్త వినగానే అందరి గుండెలు గుభేల్ మన్నాయి. ఫస్ట్ గుర్తుకొచ్చిన అంశం ఏంటంటే? ‘అసలు ఈటల’కు ఏమైంది.? ఆయన ఎందుకు పోటీచేయడం లేదు? ఈటల బరిలో నిలబడడం లేదు. ఇంత కేసీఆర్ తో కొట్లాడుతూ ఈటెల ఎందుకు నామినేషన్ వేయలేకపోయాడని అందరూ హైరానా పడ్డారు. అయితే అసలు విషయం తెలిసాక కాస్త కుదుట పడ్డారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో నామినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న వేళ ఈరోజు అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున పేరిట ఈరోజు నామినేషన్ దాఖలు కావడం సంచలనమైంది. విశేషం ఏంటంటే జమున బీజేపీ తరుఫునే నామినేషన్ వేశారు. దీంతో ఈటల పోటీచేయరా? అని అందరికీ డౌట్ వచ్చింది.
కానీ ఈనెల 8న ఈటల రాజేందర్ నామినేషన్ వేయనున్నారని.. ముందుజాగ్రత్త కోసమే ఆయన భార్య జమున నామినేషన్ వేశారని బీజేపీ వర్గాలు తెలిపాయి. రాజేందరే బీజేపీ తరుఫున పోటీలో ఉంటారని ప్రకటించాయి.
ఊరికే వేయరు మహానుభావులు అనీ.. హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ ముందు జాగ్రత్త పడ్డారని తెలుస్తోంది. ఇఫ్.. ఒక వేళ తనను ఏ కారణం చేత అయినా నామినేషన్ వేసినా అనర్హుడిగా ప్రకటించొచ్చు.. టీఆర్ఎస్ గెలుపు కోసం ఏమైనా చేయొచ్చు. ఏదో వంక పెట్టి తిరస్కరించనూ వచ్చు అన్న అనుమానం ఈటల ఉన్నట్టుంది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా తన భార్య చేత ఈటల రాజేందర్ నామినేషన్ వేయించేశారు.
తను కాకపోతే తన భార్య అయినా సరే ఎన్నికల్లో నిలబడేలా ఈటల రాజేందర్ వేసిన ఈ ఎత్తుగడ ఇప్పుడు హుజూరాబాద్ లో ఆసక్తి రేపింది.