Pawan Kalyan: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు యాక్టివ్ అయ్యాయి. ఎన్నికల ప్రచార సభలు ప్రారంభించాయి. సీఎం జగన్ సిద్ధం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. అటు చంద్రబాబు సైతం రా కదలిరా పేరిట భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు అన్ని పార్లమెంట్ స్థానాల్లో పర్యటనలు చేస్తున్నారు. అటు నారా లోకేష్ ఉత్తరాంధ్ర నుంచి శంఖారావసభలు ప్రారంభించారు. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ సైతం ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టాలని భావించారు. ఈనెల 14 నుంచి ఉభయగోదావరి జిల్లాల్లో మూడు రోజులు పాటు పర్యటించాలని షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. కానీ జగన్ సర్కార్ అనుమతి ఇవ్వకపోవడంతో పవన్ పర్యటనలకు బ్రేక్ పడింది.
పవన్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలపై ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే భీమవరం నుంచి పర్యటనలు చేయాలని డిసైడ్ భావించారు. ప్రత్యేక హెలికాప్టర్లో పర్యటనలు కొనసాగేలా షెడ్యూల్ రూపొందించుకున్నారు. అయితే భీమవరంలో ఆర్ అండ్ బి అధికారులు హెలిపాడ్ ఏర్పాటుకు నిరాకరించారు. దీంతో పవన్ షెడ్యూల్ తాత్కాలికంగా వాయిదా పడింది. జగన్ సర్కార్ కావాలనే అనుమతులు నిరాకరించిందని.. పవన్ పర్యటనలను అడ్డుకోవాలని చూస్తోందని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పుడు పవన్ నేరుగా పార్టీ ముఖ్యులు, కీలక నాయకులతో మంగళగిరి పార్టీ కార్యాలయంలో సమావేశాలు నిర్వహిస్తుండడం విశేషం.
వాస్తవానికి భీమవరం, కాకినాడ, రాజమండ్రి, అమలాపురంలో మూడు రోజులపాటు పర్యటించాలని పవన్ భావించారు. ఇప్పుడు ఆ పర్యటన వాయిదా పడడంతో.. ఆ నాలుగు ప్రాంతాలకు చెందిన ముఖ్య నాయకులను మంగళగిరి కేంద్ర కార్యాలయానికి రప్పించుకుని సమావేశం అవుతున్నారు. మూడు రోజులపాటు ఈ భేటీలు కొనసాగనున్నాయి. టిడిపి నేతలతో ఎలా సమన్వయం చేసుకోవాలి? అభ్యర్థుల ఎంపిక ఎలా? అన్నదానిపై పవన్ కీలక నేతల అభిప్రాయాలను సేకరించనున్నారు. ఈ మూడు రోజుల పాటు మదింపు తర్వాత.. ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు పవన్ రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. మొత్తానికైతే తన పర్యటనను అడ్డుకోవాలని జగన్ సర్కార్ భావిస్తే.. ఆ విలువైన సమయాన్ని పవన్ మరోలా వినియోగించుకోవడం విశేషం.