Pawan Kalyan: జనసేనానికి రాజకీయాల్లో ఓనమాలు తెలియవు. జనసైనికులు పిల్ల సైనికులు. ఆవేశం తప్ప ఆలోచన లేదు. జనసేనానికి స్పష్టత లేదు. ఎప్పుడు ఏది మాట్లాడుతారో తెలియదు. నిలకడ లేని మనస్థత్వం. పవన్ వెంట వెళ్తే కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్టే. ఇవి వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ గురించి, జనసైనికుల గురించి పేలే అవాకులు, చవాకులు. కానీ వైసీపీ అధిష్టానానికి మాత్రం పవన్ కళ్యాణ్ అంటే ఏంటో తెలుసు. పవన్ రాజకీయ పరిణితి తెలుసు. పవన్ కళ్యాణ్ శక్తి తెలుసు. తెలియనిదల్లా వైసీపీ కింది స్థాయి నేతలకే.

2014లో టీడీపీ, బీజేపీతో కలిసి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం పై నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పోరాటం చేశారు. అంతే కానీ మద్దతు ఇచ్చాం కదా అని చెట్టాపట్టాలేసుకుని తిరగలేదు. 2019లో మాత్రం జనసేన ఒంటరిగా ఎన్నికలకు వెళ్లింది. టీడీపీతో కలిసి వెళ్తుందని వైసీపీ ప్రచారం చేసినా .. ఆ ప్రచారాన్ని జనసేనాని తిప్పికొట్టారు. పొత్తు పెట్టుకోకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. టీడీపీతో సఖ్యత ఉన్నా పొత్తు విషయంలో జనసేన జాగ్రత్త పడింది. అప్పటికే ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకతను జనసేనాని పసిగట్టారు. కాబట్టే ఆ ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లారు. ఒకవేళ టీడీపీతో కలిసి వెళ్లి ఉంటే .. టీడీపీ పై ఉన్న అసమ్మతి జనసేనకూ అంటుకునేది. ఈ విషయంలో జనసేనాని చాకచక్యంగా వ్యహరించారని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహాలను వైసీపీ అధిష్టానం ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటోంది.
జనసేన బలమైన శత్రువు వైసీపీనే. అయినా కూడ 2019 ఎన్నికల్లో రాజకీయ పరిణితి ప్రదర్శించింది. అప్పటి పరిస్థితుల నేపథ్యంలో టీడీపీకి దూరంగా ఉంది. వైసీపీ కూడ ఈ వ్యూహాన్ని అర్థం చేసుకుంది. ఈ సందర్భంలోనే చంద్రబాబును వదిలి పవన్ పై విమర్శలకు దిగింది. పవన్ కళ్యాణ్ కు పెరుగుతున్న ఆదరణ, విశ్వసనీయతను గమనించి ముప్పేట దాడికి సిద్ధమైంది. 2024 ఎన్నికలకు కూడ పవన్ వ్యూహాత్మకంగా సిద్ధమవుతున్నారని వైసీపీ గుర్తించింది. అందులో భాగంగానే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని నమ్ముతోంది. పవన్ ను చంద్రబాబు కలవడం, చంద్రబాబును పవన్ కలవడం, పొత్తుల పై పార్టీ కార్యకర్తలకు అర్థమయ్యేలా సందేశమివ్వడం పవన్ ఎత్తుగడలో భాగమే అని వైసీపీ భావిస్తోంది.

పవన్ వైసీపీ పై చేసిన విమర్శల వెనుక కూడ ఎత్తుగడ ఉందని వైసీపీ భావిస్తోంది. అందుకే జగన్ కాపు మంత్రుల్నే పవన్ కళ్యాణ్ పై ఉసిగొల్పుతున్నారు. పవన్ రాజకీయ ఎత్తుగడలను ఎదుర్కునేందుకు వైసీపీ నానా తంటాలు పడుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు. పవన్ రాజకీయ చతురత, వ్యూహం గురించి వైసీపీ కింది స్థాయి నేతలకు ఆ పార్టీ నేతలు చెప్పరు. చెబితే జగన్ కంటే ఎక్కువ మైలేజ్ పవన్ కి వస్తుందని భయం. అందుకే నిత్యం పవన్ కళ్యాణ్ స్థాయి తగ్గించేలా ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడంటూ నిరాధార ఆరోపణలు వైసీపీ చేయిస్తోంది. సూర్యుడి పై ఉమ్మితే తిరిగి మన మీదే పడుతుందన్న వాస్తవాన్ని వైసీపీ గుర్తించాలి.