
Pawan Kalyan Delhi Tour: ఇప్పుడు అందరి దృష్టి పవన్ కళ్యాణ్ పై ఉంది. ఆయన ఢిల్లీ టూరే ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్. అసలు పవన్ ఢిల్లీ ఎందుకు వెళ్లారు? బీజేపీ అగ్రనేతలను ఎందుకు వరుసబెట్టి కలుస్తున్నారు? ఏం చర్చలు జరిపారు? ఒకే నాయకుడితో రెండోసారి ఎందుకు కలుస్తున్నట్టు? అసలు చర్చల సారాంశమేంటి? అని ఎక్కువ మంది ఆరాతీస్తున్నారు. అటు వైసీపీ, ఇటు టీడీపీ నాయకులు సైతం పవన్ ఢిల్లీ టూర్ పైనే మనసు లగ్నం చేసి ఉంచారు. పక్కా పొలిటికల్ అజెండాతోనే పవన్ వెళ్లారని వైసీపీలో భయం రేపుతోంది. అటు టీడీపీ సైతం ఎక్కడ పొత్తుల అంశం నిర్వీర్యమవుతుందోనని ఆందోళన చెందుతోంది. ఇటువంటి సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వనన్న పాత మాటే గుర్తుచేశారు. అటు బీజేపీది కూడా అదే అజెండా అంటూ కీలక వ్యాఖ్యలు చేసి వైసీపీని మరింత డిఫెన్స్ లో పెట్టారు.
క్షణం తీరిక లేకుండా పవన్..
ప్రస్తుతం పవన్ ఢిల్లీ టూర్ లో బిజీగా గడుపుతున్నారు. వరుసగా బీజేపీ నాయకులను కలుస్తున్నారు.బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జి మురళీధరన్‌తో రెండు విడతలుగా సమావేశమయ్యారు. తొలుత బీజేపీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్‌తో పవన్ చర్చలు జరిపారు. రాష్ట్రంలో వైసీపీ సర్కారు ప్రజా వ్యతిరేకత పాలనతో పాటు ఇక్కడి రాజకీయ పరిస్థితులపై చర్చించారు. పొత్తులు, వచ్చే ఎన్నికల్లో పోటీకి సంబంధించి ఆయన ముందు కీలక ప్రతిపాదనలు ఉంచారు. పవన్ టీడీపీతో పొత్తుకు సిద్దమవుతున్న వేళ..బీజేపీని కూడా కలుపుకుని వెళ్లాలనే ఆలోచనతో చర్చల కోసమే ఢిల్లీకి వచ్చినట్లు సమాచారం. అందులో భాగంగా.. బీజేపీ-జనసేన- టీడీపీ కలిసి 2014 తరహాలో పోటీ చేయటం ద్వారా వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా.. అధికారంలోకి రావటానికి మార్గం సుగమం అవుతుందని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీనిపై మురళీథరన్ సానుకూలంగా స్పందించారు. అగ్రనాయకత్వం దృష్టికి తీసుకెళ్తానని పవన్ కు హామీ ఇచ్చినట్టు సమాచారం.
కొన్ని అంశాలపై నడ్డా స్పష్టత..
2014 తరహాలో కూటమిగా వెళ్లాలన్న పవన్ అభిప్రాయంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా భిన్నంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఏపీలో బీజేపీ, జనసేన సొంతంగా ఎదగాలన్నదే తమ అభిమతంగా చెప్పుకొచ్చినట్టు సమాచారం. అయితే బీజేపీ బలోపేతానికి అవసరమైన అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటామని చెప్పినట్టు తెలుస్తోంది. ఏపీలో వైసీపీ సర్కారుపై పోరాటం విషయంలో బీజేపీ సహకరించి ఉంటే మరో పార్టీ సహకారం లేకుండా ఎదిగి ఉండేవారమని పవన్ నడ్డాకు వివరించారు. అయితే వైసీపీ పై పోరాటం చేయడంలో బీజేపీ ఎందుకు వెనుకబడిందో కూడా నడ్డా పవన్ కు వివరించారని తెలుస్తోంది. అయితే చివరిగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వకుండా విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అంశాలను నడ్డా ముందు పవన్ ఉంచగలిగారు. వాటిపై సానుకూల స్పందన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

రెండు ఫార్ములాతో ముందుకు..
ఏపీలో టీడీపీ, జనసేన కలిసి అడుగులు వేస్తాయని ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. అందుకు తగ్గట్టుగానే ఆ రెండు పార్టీల మధ్య సానుకూల వాతావరణం కూడా ఉంది. ఇప్పుడు బీజేపీని కలుపుకొని వెళ్లాలని చివరిసారిగా పవన్ ప్రయత్నిస్తున్నారు. కీలక ప్రతిపాదనలు బీజేపీ ముందు పెట్టారు.వాటిపై బీజేపీ పెద్దలు ఒక స్పష్టతిచ్చిన తరువాత పవన్ తన కార్యాచరణను ప్రారంభించనున్నారు. బీజేపీ అనుకూల నిర్ణయం తీసుకుంటే మూడు పార్టీల కూటమి రూపుదిద్దుకోనుంది. బీజేపీ నో చెబితే మాత్రం అందుకు అనుగుణంగా పవన్ అడుగులు వేయనున్నారు. అయితే మరో ఒకటి, రెండు రోజుల్లోదీనిపై స్పష్టత వచ్చే చాన్స్ ఉంది. బీజేపీ బలోపేతం అవుతుందనుకున్న అంశాలను విడిచిపెట్టబోమని నడ్డా స్పష్టం చేసిన నేపథ్యంలో పవన్ ప్రతిపాదనలకు బీజేపీ మొగ్గుచూపే అవకాశం ఉన్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.