Pawan Kalyan: పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గం ఏది? ఆయన ఎక్కడ నుంచి బరిలో దిగుతారు? తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు ఖరారైంది. తొలి విడత అభ్యర్థుల ప్రకటన కూడా పూర్తయింది. రెండు పార్టీల కీలక నేతలు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో స్పష్టమైంది. ఒక్క పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గం పై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. తొలుత భీమవరం(Bhimavaram) అని భావించినా.. తరువాత నాలుగు స్థానాల్లో సర్వేలు చేయిస్తున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గాలు ఇవి అంటూ.. దాదాపు పది స్థానాలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ ఇప్పుడు ఎన్నికల ముంగిట ఏదో ఒక నియోజకవర్గాన్ని ప్రకటించడం అనివార్యంగా మారింది.
సొంత నియోజకవర్గం భీమవరంలోనే పవన్ పోటీ చేస్తారని బలంగా ప్రచారం నడిచింది. అందుకు తగ్గట్టుగానే వరుస కార్యక్రమాలతో తాను ఇక్కడినుంచి పోటీ చేస్తానని పవన్ సంకేతాలు ఇచ్చారు. కానీ పవన్ భీమవరం నుంచి పోటీ చేసే ఆలోచన నుంచి విరమించుకున్నట్లు సమాచారం. పిఠాపురంలో సామాజిక సమీకరణలు కలిసి వస్తాయని.. గెలుపు ఖాయం అంటూ పార్టీ నేతలు అంచనా వేశారు. కానీ వైసీపీ గట్టి ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. పిఠాపురం నుంచి వంగా గీతను బరిలో దించడమే కాకుండా.. బలమైన కాపు నేతలను వైసీపీలోకి రప్పించడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అందుకే ఇక్కడ సైతం పోటీకి పవన్ వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు పవన్ గాజువాకలో సర్వే చేపడుతున్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన పవన్ ఇక్కడ ఓటమి చవిచూశారు. మరోసారి పోటీ చేస్తే గెలుపు ఖాయం అని ప్రచారం జరుగుతోంది. మరోవైపు తాడేపల్లిగూడెంలో సైతం పవన్ పేరుతో సర్వేలు జరుగుతున్నాయి. ఇక్కడ జనసేన కు బలమైన నేతగా బొలిశెట్టి శ్రీనివాస్ ఉన్నారు. ప్రస్తుతానికైతే పవన్ గాజువాక, పిఠాపురం, తాడేపల్లిగూడెంలో.. ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయడం ఖాయంగా తేలుతోంది. అటు ఇంతవరకు పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గ గురించి తేల్చకపోవడంతో జనసేన శ్రేణులు అయోమయం నెలకొంది. ఇప్పటికే చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ, నాదెండ్ల మనోహర్ వంటి నేతల విషయంలో స్పష్టత వచ్చింది. వీలైనంతవరకు పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గంపై స్పష్టతనివ్వాలని జనసైనికులు కోరుతున్నారు.
మరోవైపు పవన్ సోదరుడు నాగబాబు అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే అక్కడ పోటీ ప్రతిపాదన పెండింగ్లో ఉంచినట్లు తెలుస్తోంది. నాగబాబును అనకాపల్లి నుంచి కాకుండా మరో స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. బిజెపితో పొత్తు గురించి తేలిన తర్వాత రెండో జాబితాను ప్రకటించాలని టిడిపి, జనసేనలు చూస్తున్నాయి. జనసేనకు సంబంధించి ఇంకా 19 స్థానాలను ప్రకటించాల్సి ఉంది. ఆ జాబితాలో పవన్ పేరు కచ్చితంగా ఉంటుందని తెలుస్తోంది. కానీ పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు? అన్న దానిపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. ఆ మూడు నియోజకవర్గాల్లో ఏదో ఒకటి ఖాయం చేస్తారని తెలుస్తోంది.