Pawan Kalyan : పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. ఎన్నికల ప్రచార సభలకు ప్లాన్ చేస్తున్నారు. నెలాఖరు నుంచి శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు. ఇంతలో పార్టీపై దృష్టి పెట్టారు. తెలుగుదేశం పార్టీతో సమన్వయానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పొత్తులో భాగంగా ఏయే నియోజకవర్గాల్లో రెండు పార్టీల నేతల మధ్య ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటికి మొన్న కాకినాడలో వరుస సమీక్షలు జరిపారు. అటు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కూడా ఈ సమీక్షలు కొనసాగాయి. ఇప్పుడు ఉత్తరాంధ్ర పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. మూడు రోజులు పాటు జనసేన, టిడిపి నాయకులతో పవన్ సమావేశం కానున్నారు.
ఇప్పటికే పవన్ విశాఖ చేరుకున్నారు.హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఆదివారం రాత్రి విశాఖకు వచ్చారు. నేరుగా కొణతాల రామకృష్ణ ఇంటికి వెళ్లారు. అక్కడ ఏకాంతంగా భేటీ అయ్యారు. అనంతరం నోవాటెల్ హోటల్ కి పవన్ చేరుకున్నారు. ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల సమన్వయకర్తలతో పవన్ భేటీ కానున్నారు. పార్టీ పరిస్థితిని తెలుసుకోనున్నారు. ఎక్కడెక్కడ బలంగా ఉన్నాం.. పొత్తుల్లో భాగంగా ఎక్కడ సమస్యలు ఉన్నాయి? అని తెలుసుకునే ప్రయత్నం చేయనున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ నాయకులతో సైతం పవన్ మాట్లాడే అవకాశాలు ఉన్నాయి.
పవన్ ప్రధానంగా విశాఖ జిల్లా పై ఫోకస్ పెడతారని సమాచారం. పొత్తులో భాగంగా గోదావరి జిల్లాల తరువాత విశాఖ నుంచి జనసేన ఎక్కువ సీట్లు ఆశిస్తోంది. మరోవైపు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో సైతం జనసేన ఒకటి రెండు సీట్లు కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లోనే మూడు రోజులు పాటు ఇక్కడే ఉండి పరిస్థితిని తెలుసుకోనున్నారు. అన్నింటికీ మించి పొత్తులో భాగంగా ఇరు పార్టీల మధ్య సమన్వయం పై దృష్టి పెట్టనున్నారు. పొత్తులకు విఘాతం కలిగించేలా ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని ఇప్పటికే పవన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. మంగళవారం వరకు విశాఖలోపవన్ గడపనున్నారు. రాత్రికి హైదరాబాద్ చేరుకోనున్నారు. ఈనెల 22న చంద్రబాబుతో పాటు పవన్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. పొత్తుల అంశం, సీట్ల సర్దుబాటు విషయం బిజెపి ఆగ్రనేతలతో చర్చలు జరిపే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. రేపు పవన్ ఢిల్లీ టూర్ ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి.