Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. లక్షలాదిమంది అభిమానులు ఆయన సొంతం. కొందరు పవన్ ను దేవుడిలా ఆరాధిస్తారు.తాము పవన్ అభిమానులం కాదని.. భక్తులమని చెప్పుకుంటారు. అలాంటి పవన్ వీరభక్తుడు ఒకరు ఏకంగా పెళ్లి శుభలేఖ పై పవన్ ఫోటోను ముద్రించాడు.దేవుడి ఫోటో ఉండాల్సిన చోట..పవన్ ఫోటో ఉంచి జనసేనాని పై తన భక్తిని చాటుకున్నాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ చిత్రాలే వైరల్ అవుతున్నాయి. జనసేన అభిమానులతోపాటు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
పవన్ కళ్యాణ్ కు వీరాభిమానులు అయిన గుంటూరు జిల్లాకు చెందిన ఓ కుటుంబం జనసేనాని పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. గుంటూరు రూరల్ ప్రాంతానికి చెందిన లావణ్య, గోపి కుమార్ అనే జంట వివాహం రేపు జరగనుంది. ఇరు కుటుంబాలు పవన్ కు వీరాభిమానులు. ఈ సందర్భంగా వధువు తండ్రి పరికండ్ల శేషయ్య,మాధవి దంపతుల పేరిట రూపొందించిన శుభలేఖ విశేషంగా ఆకట్టుకుంటుంది.జనసేన గుర్తుతో, జనసేన సిద్ధాంతాల పేరిట రూపొందించిన ఈ వెడ్డింగ్ కార్డ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
గుంటూరు అమరావతి రోడ్డు లోని శ్రీరస్తు కళ్యాణ మండపంలో రేపు వివాహం జరగనుంది. ఇప్పటికే బంధుమిత్రులకు ఆహ్వాన పత్రికలు అందించారు. శుభలేఖ పై గాజు గ్లాసుతో పాటు పవన్ కళ్యాణ్ ముఖచిత్రాన్ని ప్రింట్ చేశారు. జనసేన సిద్ధాంతాలను సైతం అందులో చూపించారు. కులాలను కలిపే రాజకీయ విధానం.. మతాల ప్రస్తావన లేని రాజకీయం.. భాషలను గౌరవించే సాంప్రదాయం.. సంస్కృతులను కాపాడే సమాజం.. ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం.. అవినీతి అక్రమాలపై రాజీలేని పోరాటం.. పర్యావరణాన్ని పరిరక్షించే విధానం.. అంటూ జనసేన సిద్ధాంతాలను శుభలేఖలు పొందుపరచడం.. ఆకట్టుకుంటోంది.
పవన్ కళ్యాణ్ కు ఆ కుటుంబం వీరాభిమానం. తమ కుటుంబంలో శుభకార్యాన్ని పవన్ ను పెద్దమనిషి హోదాలో ఉంచి వివాహం జరిపించడానికి డిసైడ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ దేవుడు అంటున్న ఆ కుటుంబం.. శుభలేఖ పై దేవుడు ఫోటో ఉండాల్సింది చోట.. పవన్ ఫోటోను ముద్రించారు. ఈ పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని పవన్ కళ్యాణ్ సైతం ఆహ్వాన పత్రికను పంపారు. ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ ను పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.