Pawan Kalyan: వారాహి యాత్రలో కీలక ఘట్టం. నేటి నుంచి పవన్ ఉపవాస దీక్ష ప్రారంభించనున్నారు. వారాహి అమ్మవారి నవరాత్రులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. నవరాత్రుల్లో చివరి మూడు రోజులు దీక్ష చేపట్టాలని తొలుత భావించారు. కానీ తొలిరోజు నుంచే ప్రారంభించడానికి డిసైడయ్యారు. పవన్ వారాహి యాత్ర ఉభయ గోదావరి జిల్లాల్లో కొనసాగుతోంది. అశేష జనవాహిని నడుమ పవన్ యాత్ర చేపడుతున్నారు. ప్రత్యర్థులపై పదునైన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. యాత్రకు ప్రారంభం ముందు మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో యాగం నిర్వహించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి శాఖాహారం తింటున్న ఆయన నేటి నుంచి పండ్లు, పాలనే ఆహారంగా తీసుకోనున్నారు.
వారాహిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. శత్రుభయం పోతుంది. అపారమై తెలివితేటలు సొంతమవుతాయని ఆధ్యాత్మికవేత్తలు చెబుతుంటారు. పవన్ తన వాహనానికి వారాహి అని పేరుపెట్టినప్పుడే ఒకరకమైన చర్చ నడిచింది. వారాహి అమ్మవారు గురించి ఎక్కువగా ప్రస్తావన జరిగింది. చాలామంది తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పడు వారాహి అమ్మవారి నవరాత్రులు ప్రారంభం కానుండడం, పవన్ దీక్ష చేపడుతుండడంతో మరోసారి చర్చకు కారణమవుతోంది.
ఏటా గురుపౌర్ణమి నాడు పవన్ చతుర్మాస దీక్ష చేపడుతూ వస్తున్నారు. ఇప్పుడు వారాహి అమ్మవారి దీక్షకు తోడు చతుర్మాస దీక్ష కొనసాగనుంది. కార్తీకమాసం చివరి వరకూ దీక్ష చేపట్టనున్నారు. ఆహార నియమ నిబంధనలు పాటించనున్నారు. కేవలం పండ్లు, పాలు మాత్రమే తీసుకోనున్నారు. లోక కళ్యాణార్ధం దీక్ష చేపడుతున్నట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి. కాగా వారాహి యాత్ర ఈ రోజు ముమ్మడివరంలో కొనసాగనుంది.రేపు అమలాపురం, ఎల్లుండి పి.గన్నవరంలో పవన్ యాత్ర చేపట్టనున్నారు. 23న నర్సాపురంలో ముగియనుంది. అటు ప్రజాయాత్రతో పాటు లోకకళ్యాణార్ధం పవన్ ఆధ్యాత్మిక దీక్ష చేపట్టనున్నారన్న మాట.