2000 Note Withdrawal: పెద్ద నోట్లు రద్దు చేస్తూ అప్పట్లో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇది జరిగిన కొద్ది కాలానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 నోటును ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. దీనికి సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం కొంత మోదాన్ని, కొంత ఖేదాన్ని కలిగిస్తోంది.. ఏది ఏమైనప్పటికీ కరెన్సీ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిందే అంతిమం.. ఈ క్రమంలో దేశంలో పలు బ్యాంకుల్లో తమ వద్ద ఉన్న 2000 నోట్లను ప్రజలు మార్చుకుంటున్నారు. ఇందులో బడా బాబులకు సంబంధించిన డబ్బులు కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.. అయితే 200 0 నోటు విడుదల చేసిన తర్వాత రాజకీయ నాయకులు ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు భారీగా ఆ నగదును పోగు చేశారు. అయితే ఎలాగైనా బయటకు తీయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.. ఇది ఆచరణలో సాధ్యమవుతుందా అనేది పక్కన పెడితే.. 2000 నోటు ఉపసంహరణ తర్వాత రిజర్వ్ బ్యాంకు అనుకున్నదొకటి.. జరుగుతున్నది మరొకటి.
నోట్లు పెరిగాయి
2000 నోట్ల ఉపసంహరణ ప్రభావంతో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ వ్యవస్థలో డిపాజిట్లు భారీగా పెరిగాయి. ఈనెల 2వ తేదీతో ముగిసిన పక్షం రోజుల్లో బ్యాంకు డిపాజిట్లు ఏకంగా 3.26 లక్షల కోట్లు పెరిగి 187.02 లక్షల కోట్లకు చేరుకున్నాయి. బ్యాంకుల రుణాలు మరో 1.14 లక్షల కోట్లు పెరిగి 140. 08 కోట్లుగా నమోదయ్యాయి. గత నెలలో 2000 నోట్లు ఉపసంహరించుకున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన నేపథ్యంలో ఈ మార్పులు చోటు చేసుకుంటుండడం విశేషం. సెప్టెంబర్ 30 వరకు 2000 నోట్లు చలామణిలో ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. అప్పటికల్లా వాటిని బ్యాంకులో డిపాజిట్ చేయడం లేదా ఇతర డి నామినేషన్ కరెన్సీ నోట్లు గా మార్చుకునేందుకు అవకాశం కల్పించింది.
ఈ మార్చి 31 నాటికి మొత్తం 3.62 లక్షల విలువైన కోట్ల 2000 నోట్లు మార్కెట్లో చెలా మణి లో ఉన్నాయి. దాదాపు 50 శాతానికి సమానమైన 1.80 లక్షల నోట్లు ఇప్పటికే బ్యాంకులోకి వచ్చి చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తి కాంత దాస్ తెలిపారు. ఈనెల 8న ద్రవ్యపరపతి సమీక్ష నిర్ణయాలు ప్రకటించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక 2000 నోట్లు తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి చేరుతుండటంతో వ్యవస్థలో చలామణిలో ఉన్న నగదు మొత్తం విలువ కూడా గణనీయంగా తగ్గింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా సమాచారం ప్రకారం ఈ నెల రెండవ తేదీ నాటికి మార్కెట్లో చలా మణి లో ఉన్న మొత్తం నగదు విలువ. 83, 242 కోట్ల మేర తగ్గి 32.88 లక్షల కోట్లకు పరిమితమైంది. వ్యవసాయ పనులు ప్రారంభమైన సమయంలో సాధారణంగా వ్యవస్థలో నగదు చలామణి పెరుగుతుంది. కానీ 2000 నోటు రద్దు ప్రభావం నేపథ్యంలో క్యాష్ సర్కులేషన్ తగ్గిందని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు డిజిటల్ పేమెంట్ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో రైతులు కూడా నగదుకు బదులు ఆ మార్గం మీదుగానే చెల్లింపులు జరుపుతున్నారు. మరోవైపు 2000 నోటు ఉపసంహరణ తర్వాత బ్యాంకుల్లో డిపాజిట్లు పెరగడం ఒకింత ఆందోళన కలిగిస్తోంది.