
Pawan Kalyan: తెలంగాణ ప్రజల ఆలోచన సరళి.. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆలోచన సరళికి భిన్నంగా ఉంటుందా..? ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే తెలంగాణ ప్రాంత ప్రజలు ఆలోచన విధానం ఉన్నతంగా ఉంటుందా..? జనసేన ఆవిర్భావ సభ వేదికగా పవన్ కళ్యాణ్ రెండు రాష్ట్రాల ప్రజల మధ్య ఉన్న తేడాను ప్రస్తావించడం దేనికి సంకేతమో ఈ కథనంలో చూద్దాం.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మచిలీపట్నంలో నిర్వహించిన ఆవిర్భావ సభ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించడం సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఒకింత భావోద్వేగంతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ తనను ఆదరించకపోయినా, గత ఎన్నికల్లో ఓటమిని అందించిన ఏపీ ప్రజల కోసం తాను పదేళ్ల నుండి కృషి చేస్తూనే ఉన్నానని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల గురించి ఆవేదన వ్యక్తం చేస్తున్న పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల పొత్తుపై తేల్చి చెప్పారు. ఈసారి బలిపశువును కానని, గతానికి భిన్నంగా అనేక ఆసక్తికర అంశాలపై పవన్ కళ్యాణ్ సభ వేదికగా మాట్లాడడం రాజకీయాల్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఏపీ.. తెలంగాణ రాజకీయాల్లో తేడా ఇదే..
ఏపీలో ప్రజల కోసం తాను పరితపిస్తున్న విధానాన్ని చూసి, ఇక్కడి ప్రజలు అండగా ఉండకపోవడాన్ని తెలంగాణలోని తన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో మాదిరిగా తెలంగాణలో తాను పోరాటం చేస్తే ఇక్కడ అభిమానులు, ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని తెలంగాణ ప్రాంతానికి చెందిన అభిమానులు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సభ వేదికగా చెప్పడం గమనార్హం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు తెలంగాణ రాజకీయాలకు మధ్య వ్యత్యాసం పవన్ కళ్యాణ్ చెప్పారు. తెలంగాణలో అన్ని కులాలు వారు ఉన్నప్పటికీ వారందరికీ ఉమ్మడి నినాదం తెలంగాణ అని స్పష్టం చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి ఆ విధంగా లేదని, ఇక్కడ ప్రజల్లో ఎవరికీ ఉమ్మడి నినాదం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కులాలకే ప్రాధాన్యతనిస్తూ ప్రజలు రాష్ట్రాన్ని పట్టించుకోవడంలేదని, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హానిచేస్తుందని పవన్ కళ్యాణ్ వాపోయారు.
తెలంగాణలో అయితే సక్సెస్ అయ్యే వాడిని..
పార్టీ పెట్టిన తర్వాత ఏపీ రాజకీయాల్లో మాదిరిగా తెలంగాణలో రాజకీయాలు చేసి ఉంటే తాను విజయం సాధించి ఉండేవాడిని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల కులాల కుంపటి మధ్య చిక్కుకోలేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తాను డబ్బు కోసం రాజకీయాలు చేయడం లేదని, రోజుకు రెండు కోట్ల రూపాయలు సంపాదించే శక్తి, సామర్ధ్యాలను అభిమానులు తనకు ఇచ్చారని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఓటుకి డబ్బు ఇచ్చుకునే సంస్కృతి తమ పార్టీకి లేదని, తనకు ఓటు ప్రాధాన్యం కాదని, తన మీద నమ్మకం చూపిస్తే చాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కులాల వారీగా ప్రజలను విడదీసే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన రాష్ట్రంలోని అన్ని కులాలను కలిపేందుకు ప్రయత్నం చేస్తుందని చెప్పారు. జనసేన సమాజంలో పరివర్తన తీసుకురావడానికి ఉందని పేర్కొన్న పవన్ కళ్యాణ్ ఏదో ఒక కులాన్ని గద్దె దించడానికి తాను పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని కులాలు పాలనలో భాగస్వామ్యం తీసుకోవాలని, ఒక్క కులం పెత్తనం ఆగిపోవాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మధ్య ఉన్న ఈ తేడా కులాల కుంపట్లేనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎప్పటికైనా కుల చట్టం నుండి ప్రజలు బయటకు రావాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.