Pawan Kalyan: పవన్ వారాహి యాత్రకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లాలో వారాహి యాత్ర కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటన తర్వాత చేపట్టిన ఈ యాత్ర విజయవంతంగా సాగుతోంది. అయితే వ్యక్తిగత, రాజకీయ కారణాలతో యాత్రను మూడు వారాలు వాయిదా వేస్తూ పవన్ నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 26 తర్వాత యాత్రను కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 17 వరకు రాజకీయ వ్యూహాలు, పొత్తు అంశాలు, బిజెపితో సంప్రదింపులు వాటితో పవన్ బిజీగా ఉండనున్నారు. అటు తరువాత వరుణ్ తేజ్ వివాహ వేడుకలకు ఇటలీ వెళ్ళనున్నారు.
స్కిల్స్ స్కాం లో చంద్రబాబు అరెస్ట్ తర్వాత పవన్ రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి ఆయన పరామర్శించారు. అనంతరం పొత్తు ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళనున్నట్లు ప్రకటించారు. తక్షణం రెండు పార్టీల ఉమ్మడి కార్యాచరణ ప్రారంభమవుతుందని వెల్లడించారు. అటు తరువాత వారాహి యాత్రను ప్రారంభించారు. కీలక అంశాలపై క్లారిటీ ఇచ్చారు. తాను ఎన్డీఏలో ఉన్న తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.బిజెపిని సైతం కలుపుకొని వెళ్తామని చెప్పుకొచ్చారు.అయితే వారాహి యాత్రను కొనసాగిస్తే రాజకీయ వ్యూహాలు,బిజెపి అగ్రనేతల తో సంప్రదింపులు వంటి వాటికి జాప్యం జరుగుతోంది.దీంతో కొద్దిరోజులు పాటు యాత్రను నిలిపివేయడమే శ్రేయస్కరమని భావించారు.
మూడు రోజులపాటు జనసేన కీలక నాయకులతో పవన్ సమావేశం కానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ స్థితిగతులపై చర్చించనున్నారు. ఏ పరిస్థితుల్లో టిడిపి తో పొత్తు పెట్టుకోవలసి వచ్చిందో వివరించనున్నారు.అదే సమయంలో తెలుగుదేశం పార్టీతో సమన్వయం, ఉమ్మడి కార్యాచరణకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. ఒకవేళ చంద్రబాబుకు జైలు నుంచి విముక్తి కలిగితే వెనువెంటనే కలుసుకోనున్నారు. అటు భారతీయ జనతా పార్టీ అగ్రనేతలతో సైతం చర్చించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో 32 అసెంబ్లీ నియోజకవర్గాలకు జనసేన అభ్యర్థులను ప్రకటించారు. అక్కడ ఎలా ముందుకెళ్లాలో తెలంగాణ జనసేన నేతలతో పవన్ చర్చించనున్నారు.
నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ వివాహ వేడుకలు ఇటలీలో జరగనున్నాయి. ఇప్పటికే మెగా ఫ్యామిలీ ఇటలీ చేరుకుంది. ఫ్రీ వెడ్డింగ్ వేడుకల్లో మునిగి తేలుతోంది. వివాహానికి హాజరయ్యేందుకుగాను ఈ నెల 17 తర్వాత పవన్ కుటుంబంతో ఇటలీ వెళ్ళనున్నారు. 26న తిరిగి ఏపీకి చేరుకోనున్నారు. 27 తర్వాత వారాహి యాత్ర ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.