Pawan Kalyan: పవన్ దూకుడు పెంచారు. ఎన్నికల వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. వీలైనంత త్వరగా జనసేన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటించిన సంగతి తెలిసిందే. సీట్ల సర్దుబాటు త్వరలో కొలిక్కి రానుంది. ఇంతలో రాష్ట్రవ్యాప్తంగా బలమైన నియోజకవర్గాలను ఎంపిక చేసే పనిలో పవన్ పడ్డారు. అందులో భాగంగా పవన్ మూడు రోజులు పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పార్టీ వ్యవహారాలపై దృష్టి సారించనున్నారు. ఎందుకు గాను ఆయన కాకినాడలో బస చేసి పార్టీ స్థితిగతులపై సమీక్షించనున్నారు.
జనసేనకు బలమున్న ప్రాంతాల్లో ఉభయ గోదావరి జిల్లా ఒకటి. టిడిపి తో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఈ జిల్లాలో అధిక నియోజకవర్గాలను దక్కించుకోవాలన్నది పవన్ ప్లాన్. ఇక్కడ రెండు పార్టీలు సమన్వయం చేసుకొని వ్యవహరిస్తే కూటమి దాదాపు క్లీన్ స్లీప్ చేయడం ఖాయమన్న విశ్లేషణలు ఉన్నాయి. అందుకే జనసేన పోటీ చేయబోయే నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను బరిలో దించేందుకు పవన్ ప్లాన్ చేస్తున్నారు. టిడిపి అభ్యర్థులు పోటీ చేయబోయే నియోజకవర్గాల్లో జనసేన శ్రేణులను సమన్వయం చేయనున్నారు. ఇక్కడ మంచి ఫలితాలను సాధిస్తేనే ప్రభుత్వం ఏర్పాటుకు సుగమం అవుతుందని పవన్ భావిస్తున్నారు. అందుకే పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు.ఇప్పటిక సర్వే ప్రక్రియ పూర్తయిందని.. ఏయే నియోజకవర్గాల్లో టిడిపి, జనసేన అభ్యర్థులు పోటీ చేస్తే మంచి ఫలితాలు వస్తాయో ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు నియోజకవర్గాల రివ్యూకు పవన్ సిద్ధపడ్డారు.
రేపు పవన్ కాకినాడ చేరుకోనున్నారు. అక్కడే రాత్రి బస చేయనున్నారు. 28, 29, 30 తేదీల్లో కాకినాడ పార్లమెంట్ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేయనున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో జనసేనకు మెజారిటీ స్థానాలు లభించే అవకాశం ఉంది. ఇప్పటికే వాటిపై ఓ స్పష్టత వచ్చిందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అందుకే పార్టీ నేతలందరినీ సమన్వయం చేసుకొని.. ఓటమి విజయానికి పవన్ కళ్యాణ్ విలువైన సందేశాలు ఇస్తారని తెలుస్తోంది. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల జనసేన నేతలకు సమాచారం అందించారు. మూడు రోజులపాటు సీరియస్ గా చర్చలు, సమీక్షలు కొనసాగనున్నాయి.
గత ఎన్నికల్లో 20 నుంచి 30 వేలు ఓట్లు సాధించిన నియోజకవర్గాలపై పవన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అటు తెలుగుదేశం, ఇటు జనసేన సాధించిన ఓట్ల వివరాలను తెలుసుకోవడంతో పాటు అక్కడ ఎవరు బరిలో దిగితే బలమైన అభ్యర్థి అవుతారో ఆరా తీయనున్నారు. ఈ సమగ్ర నివేదికను రూపొందించి.. జనసేనకు బలమైన నియోజకవర్గాలు ఏవో గుర్తించనున్నారు. గత అనుభవాలు, బలాలను దృష్టిలో పెట్టుకునే అడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావాన్ని తగ్గించడానికి జగన్ చాలా ప్లాన్లు వేస్తున్నారు. ముద్రగడ పద్మనాభం లాంటి వారిని తెరపైకి తెస్తున్నారు. మరోవైపు టిడిపి తో పొత్తు విచ్చిన్నానికి సైతం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలను చెప్పడంతో పాటు సీట్ల సర్దుబాటు, ఓట్ల బదలాయింపు విషయంలో పార్టీ శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం చేయనున్నారు.