Pawan Kalyan Varahi Yatra: పవన్ మూడో విడత వారాహి యాత్ర విశాఖలో ప్రారంభమైంది. ఎన్నో సంచలనాలకు వేదికగా మారనుంది. ఉభయగోదావరి జిల్లాల్లో తొలి రెండు విడతల యాత్ర పూర్తి చేసిన పవన్.. మలి విడతను మాత్రం విశాఖ జిల్లా ను ఎంచుకున్నారు. ఇదంతా వ్యూహాత్మకమేనని తెలుస్తోంది. తొలుత రాయలసీమ జిల్లాల్లో యాత్ర చేస్తారని అంతా భావించారు. కానీ పవన్ మాత్రం ఉత్తరాంధ్ర వైపు మొగ్గు చూపారు.
విశాఖ నగరంలోని నాలుగు నియోజకవర్గాల్లో తొమ్మిది రోజులపాటు వారాహి యాత్ర జరగనుంది. అయితే ప్రారంభంలోనే పవన్ గట్టి సంకేతాలు పంపారు. మాజీమంత్రి, సీనియర్ నాయకురాలు పడాల అరుణను పార్టీలో చేర్చుకున్నారు.ఇప్పటికే వైసిపి విశాఖ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పంచకర్ల రమేష్ బాబు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.జనసేనలో చేరారు.ఆయన బాటలో చాలామంది నాయకులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ జాబితాలో పలువురు మాజీ మంత్రులు,ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం.
వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ విధ్వంసానికి గురైనట్లు ఆరోపణలు వచ్చాయి. విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించిన తరువాత భూ కబ్జాలు, విధ్వంసాలు పెరిగినట్లు టాక్ నడుస్తోంది. విశాఖకు ల్యాండ్ మార్క్ గా నిలిచే రుషికొండనుకనీస ఆనవాళ్లు లేకుండా చేశారు. ఎక్కడికక్కడే ప్రభుత్వ భూములను లేకుండా చేశారన్న అపవాదు ఉంది. ఆంధ్ర యూనివర్సిటీ భూములను సైతం పక్కదారి పట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. సాగర నగరానికి ప్రశాంతత లేకుండా చేశారని ప్రజల నుండి విమర్శలు వ్యక్తం అయ్యాయి. వీటన్నింటి పైన పవన్ గళం ఎత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే వైసిపి నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
విశాఖలో వారాహి యాత్ర అనేసరికి ఒక రకమైన వాతావరణం క్రియేట్ అయ్యింది. ఎన్నో సంచలనాలకు వేదికగా మారనందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడ్డారు. ఉభయగోదావరి జిల్లాల్లో జరిగిన యాత్రలో పవన్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. దానికి మించి విశాఖలో పవన్ ప్రసంగాలు ఉంటాయని అంతా భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే తొలిరోజు వైసీపీ సర్కార్ పై పవన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ దాడిని మున్ముందు ఆయన కొనసాగించనున్నారు. యాత్ర ముగిసే నాటికి కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.