Pawan Kalyan: పొత్తులో భాగంగా పవన్ కీలక బాధ్యతను తీసుకున్నారు.టిడిపి, జనసేన నాయకులతో నేరుగా మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు పొత్తు పెట్టుకున్నాం? దాని వెనుక ఉన్న కారణాలు ఏంటి? ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డాం? అన్న విషయాలను స్పష్టంగా చెబుతున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం కుదుర్చుకున్న ఈ పొత్తులో మీరు భాగస్తులు కావాలని.. త్యాగాలకు సిద్ధం కావాలని పిలుపునిస్తున్నారు. నేరుగా పవన్ కోరేసరికి అటు టిడిపి నేతలు, జనసేన నేతలు సైతం మెత్తబడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ జిల్లాల పర్యటనలో ఉన్నారు. వరుసగా అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు. జనసేనతో పాటు టిడిపి నాయకులు సైతం ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఈ సమావేశాల్లోనే పవన్ కీలక సూచనలతో ప్రసంగాలు చేస్తున్నారు. అవి కొంతవరకు వర్కౌట్ అయ్యేలా కనిపిస్తున్నాయి.
భీమవరంలో పవన్ ఆలోచనతో కూడిన ప్రసంగాలు రెండు పార్టీల శ్రేణులను ఆకట్టుకున్నాయి. సంచలనం గా మారాయి. చంద్రబాబు అరెస్టు సమయంలో తెలుగుదేశం పార్టీతో పవన్ పొత్తు ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే ఎన్డీఏ భాగస్వామి పక్షంగా ఉన్న తమను కనీసం సంప్రదించకుండా టీడీపీతో ఎలా పొత్తు పెట్టుకుంటారని కేంద్ర పెద్దలు పవన్ ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.ఒకానొక దశలో చీవాట్లు తిన్నట్లు కూడా పవన్ గుర్తు చేశారు. ఎన్ని తిట్టినా భరించి చేతులు జోడించి దండాలు పెట్టి.. రాష్ట్ర నాశనం అయిపోతుంది అని చెప్పి.. జాతీయ నాయకులకు ఒప్పించానని.. అందుకే తన కష్టాన్ని గుర్తించి రెండు పార్టీల శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని పవన్ పిలుపునిచ్చారు.
151 మంది ఎమ్మెల్యేలు, వేలాదిమంది ప్రైవేట్ సైన్యంగా ఉన్న వాలంటీర్లు, అధికార పార్టీ కనుసన్నల్లో నడిచే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్ అధికారులు, దాడుల సంస్కృతిని నమ్ముకున్న వైసీపీ నేతలను ఎదుర్కోవాలంటే బీజేపీ సహకారం అవసరమన్నారు. అందుకే ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నట్లు పవన్ ప్రకటించారు. మూడు పార్టీలు కలిస్తేనే మహావృక్షంగా ఉన్న వైసీపీని పెకిలించవచ్చని పవన్ చెప్పుకొచ్చారు. మూడు పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు కూడా సక్రమంగా జరగాలని అభిప్రాయపడ్డారు.
ఇదంతా తన కోసమో.. జనసేన గెలుపు కోసం చేయడం లేదని.. ఏపీ భవిష్యత్తు కోసమే ఇన్ని అవమానాలు తట్టుకొని ముందుకు వెళుతున్నట్లు పవన్ తేల్చి చెప్పారు. రాష్ట్రంలో వైసిపి చేస్తున్న అరాచక పాలన నుంచి ప్రజలను, రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి ఇదంతా చేస్తున్నట్లు పవన్ చెప్పుకొస్తున్నారు.ఒక స్టార్ హీరోగా ఉంటూ.. ప్రజల్లో ఆదరాభిమానాలు ఉన్న నేను ఈ రాష్ట్ర క్షేమం కోసంపొత్తులకు ప్రయత్నించానని.. మూడు పార్టీల శ్రేణులు ఈ విషయం గమనించాలని పవన్ పిలుపునివ్వడం విశేషం. మొత్తానికైతే పొత్తుల ప్రకటన ముందు పవన్ చేస్తున్న ఈ ప్రయత్నాలు బాగానే వర్కౌట్ అవుతున్నాయి.