• మనకు బలం ఉంది… కాబట్టే మనపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారు
• రాష్ట్ర ప్రయోజనాలకు మన పార్టీ అవసరం
• ఏడేళ్లు కాదు ఏడు దశాబ్దాలయినా జనసేన నిలబడుతుంది
• అధికారం వచ్చినా రాకున్నా జనసేన ఉనికి కోల్పోదు
• దేశ సమగ్రతకు అవసరమనే బీజేపీతో పొత్తు
• క్రిమినల్స్ మనల్ని పాలించాలి అనుకొంటే వైసీపీకి మద్దతు ఇవ్వండి
శనివారం సాయంత్రం ధవళేశ్వరం సమీపంలోని శ్రీరామ పాదాల రేవులో మన నది – మన నుడి కార్యక్రమం ప్రారంభించిన అనంతరం జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ మనల్ని ఒక విధంగా భయపెడితే… వైసీపీ మనల్ని మరోలా భయపెట్టాలని చూస్తోందని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. లొంగిపోయి ఉనికి కోల్పోతామో… గుండె ధైర్యంతో నిలబడి సత్తా చాటడమో యువతే నిర్ణయించుకోవాలని అన్నారు. క్రిమినల్స్ మనల్ని పాలించాలి అనుకుంటే వైసీపీకి మద్దతు ఇవ్వండి… సమ సమాజం నిర్మిద్దామనుకుంటే జనసేనకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో ధైర్యం, తెగింపు ఉండాలని, లేనివారు జనసేనలోకి రావొద్దని అన్నారు. శనివారం ఉదయం రాజమహేంద్రవరంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “సమాజానికి పిరికితనం ఆవహించింది. దానిని తొలగించి, ధైర్యం నూరిపోయడానికే జనసేన పార్టీ పెట్టాను. పార్టీ ప్రారంభించే నాటికి ఆంధ్ర పాలకులు చేసిన తప్పులకు ఆంధ్ర ప్రజలను తిడుతుంటే, దాడులు చేస్తారనే భయంతో ఒక్క నాయకుడు కూడా ధైర్యంగా మాట్లాడలేకపోయారు. ఒక్కొక్కరికి వేలకోట్లు, వేల ఎకరాలు ఉన్నా వారిలో ధైర్యం చచ్చిపోయింది. ధైర్యంగా ఒక్కడైనా మాట్లాడాలని ఆ రోజు పార్టీ పెట్టాను.
• పిడుగు మీద పడ్డా నిలబడే వ్యక్తులు కావాలి
అధికార పార్టీ బెదిరింపులకు, ఒత్తిళ్లకు భయపడి కొంతమంది నాయకులు పారిపోతున్నారు. అలాంటి వారిని పెట్టుకొని పార్టీ నిర్మాణం చేయలేను. పిడుగు మీద పడ్డ, ఫిరంగు వదిలినా బెదరకుండా నిలబడే వ్యక్తులే పార్టీకి కావాలి. అలాంటి వారి కోసమే ఎదురుచూస్తున్నాను. రాజమండ్రిలో కవాతు చేస్తే దాదాపు 10 లక్షల మంది వరకు వచ్చారు.
ఓటు మాత్రం ఎవరైతే రౌడీయిజం చేస్తారో, క్రిమినల్స్ ను ప్రోత్సహిస్తారో వారికి వేశారు. మహాత్ముడిని పూజిస్తాం… నేతాజీని గౌరవిస్తాం… అంబేద్కర్ ను గుండెల్లో పెట్టుకుంటాం… కానీ ఎన్నుకున్నది మాత్రం నేరచరిత్ర ఉన్న వ్యక్తులని. ఇదేమి లాజిక్కో నాకు అర్ధం కాదు. ఓటమి ఎదురైనా ఎక్కడో ఒక దగ్గర మార్పు రావాలని బలంగా నిలబడ్డాను. ఏడు సంవత్సరాలు కాదు ఏడు దశాబ్దాలు అయినా జనసేన పార్టీ బలంగా నిలబడుతుంది.
•జనసేన ఉనికి లేకపోతే పవన్ కళ్యాణ్ లేడు
భారత దేశానికి సర్ధార్ వల్లభాయ్ పటేల్ తర్వాత అంత బలమైన హోంమంత్రి అమిత్ షా గారు. అలాంటి వ్యక్తి వచ్చి భారతీయ జనతా పార్టీలో జనసేన పార్టీని విలీనం చేయమని కోరినా కాదన్నాను. రాష్ట్ర ప్రయోజనాలకు జనసేన పార్టీ అవసరం ఉందని గ్రహించి ఆ నిర్ణయం తీసుకున్నాను. జనసేన అనే ఉనికి కోల్పోతే పవన్ కళ్యాణ్ లేనట్లే. పార్టీ ఉనికిని ఎప్పుడూ కాపాడుతాను. అధికారం వచ్చినా రాకపోయినా ఉనికి మాత్రం కోల్పోము. ఏదో ఒక రోజు జనసేన అనే మొక్క మహావృక్షమై తీరుతుంది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీతో విభేదించాను తప్ప… నా స్వార్ధం కోసం ఏనాడు విభేదించలేదు. రాజకీయాలు అంటే జనసేన పార్టీకి నేషనల్ సర్వీసు.
జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీతోపాటు అన్ని పార్టీలు వెంపర్లాడాయి. కానీ జనసేన మాత్రం బీజేపీతో పొత్తు పెట్టుకుంది. దీనికి కారణం దేశాన్ని పటిష్టం చేయాలన్న, దేశసమగ్రతను కాపాడాలన్న అది బీజేపీతోనే సాధ్యం. ముఖ్యంగా బీజేపీ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం. మిగతా పార్టీలన్ని వారసత్వ పార్టీలే. ఇవాళ నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు మాదిరి భవిష్యత్తులో ఆ పార్టీలో ఇంకా బలమైన నాయకులు వస్తారు. కర్ణాటకలో ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని ఒక జర్నలిస్టునీ, న్యాయవాదినీ ఎంపీలుగా చేసింది. దేశానికి ఇలాంటి పార్టీ అవసరమని పార్టీ నాయకులతో ముఖ్యంగా ముస్లిం నాయకులతో చర్చించి పొత్తు పెట్టుకున్నాం.
• వైసీపీ నాయకులది మేకపోతు గాంభీర్యం
2018 అక్టోబర్ లో తిత్లీ తుపాన్ సంభవించి శ్రీకాకుళం జిల్లా అతలాకుతలం అయితే జనసేన పార్టీ పరుగుపరుగున అక్కడికి చేరుకుంది. చిమ్మ చీకట్లలో బాధితులకు అండగా నిలబడింది. ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పక్కనే ఉన్న విజయనగరం జిల్లాలో ఉన్నా అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. కానీ అలాంటి పార్టీ గెలిచింది అంటే తప్పు జనసేనది కాదు… ఓట్లు వేసిన ప్రజలది. వైసీపీ నాయకులు ఢిల్లీలో బీజేపీ నాయకులకు మద్దతుగా మాట్లాడతారు. ఇక్కడికి వచ్చి మేము వాళ్లకు వ్యతిరేకం అంటారు. ఢిల్లీలో కాళ్ళు పట్టుకుంటారు. ఇక్కడకొచ్చి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తారు. నేను అలా చేయను. జనసేన పార్టీ స్థాపించింది అందరూ వదిలేసిన సమస్యలను పరిష్కరించడానికే. నిస్సహాయులకు అండగా ఉండాలనే. కర్నూలులో 14 ఏళ్ల అమ్మాయి సుగాలీ ప్రీతిని అతి దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు. న్యాయం చేయాలని అన్ని ఆధారాలతో దివ్యాంగురాలైన ఆమె తల్లి కన్నీటితో వేడుకుంటే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంగానీ, ఇప్పటి వైసీపీ ప్రభుత్వంగానీ పట్టించుకోలేదు. జనసేన పార్టీ పోరాడి బాధితులకు అండగా నిలబడింది కనుకే ఇవాళ సుగాలీ ప్రీతి కేసును ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. గోదావరి రైతుల సమస్యలు, అమరావతి రైతుల ఆవేదనను ప్రపంచానికి తెలిసేలా చేశాం. వ్యవస్థలో మార్పు రావాలంటే మనలాంటి వారు బయటకు రావాలి.
• మాదైన రోజున సత్తా చూపిస్తాం
జనసేన పార్టీకి బలం ఉండబట్టే వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీని వదిలేసి మన పార్టీ నాయకుల మీద దాడులు, బెదిరింపులకు పాల్పడుతుంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో జనసేన నాయకులపై దాడులకు పాల్పడ్డారు. పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ బొలిశెట్టి సత్య, పార్టీ పి.ఏ.సి. సభ్యులు డా.హరిప్రసాద్, శ్రీకాళహస్తి పార్టీ ఇంచార్జ్ శ్రీమతి వినుత, ఇతర నాయకులపై కేసులుపెట్టారు. అనంతపురంలో పీఏసీ సభ్యులు శ్రీ చిలకం మధుసూదర్ రెడ్డిపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, జిల్లాలో నామినేషన్లు ఉపసంహరించుకోవాలని బెదిరింపులకు దిగుతున్నారు. జనసేన ప్రభావం ఏమీ లేదంటూనే భౌతిక దాడులకు దిగుతున్నారు. ఇన్ని బెదిరింపులకు దిగుతున్నా అనంతపురం జిల్లాలో శ్రీమతి పద్మావతి పోటీకి దిగారు. అలాంటి వీరమహిళలు మనకు ఉన్నారు. కాకినాడలో దాడులు చేసినప్పుడూ వీర మహిళలు ధైర్యంగా ఉన్నారు. అధికార పార్టీ దాడులకు, ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లొంగకుండా నిలబడ్డ అభ్యర్ధులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. జనసైనికులపై దాడులు చేసినా, అక్రమంగా కేసులు పెట్టి బెదిరించినా, ప్రలోభాలకు గురి చేసినా బలంగా నిలబడే సమూహం జనసేనది. మాదైన రోజున సత్తా చూపిస్తాం. అప్పటి వరకు భరిస్తామని” అన్నారు.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Pawan kalyan speech at mana nudi mana nadi
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com