Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు. సినిమాలను నిలిపివేసి రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొద్దిరోజులుగా సమీక్షలు, సమావేశాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇటువంటి తరుణంలో పవన్ తన ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. ఓ అభిమాని భావోద్వేగాన్ని తెలియజేస్తోంది. ఆ లేఖను చూసి తాను దుఃఖం ఆపుకోలేకపోయానని పవన్ చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.
పవన్ రాజకీయాల కోసం సినిమాలను తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పెట్టారు. ముఖ్యంగా సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఓజి సినిమా షూటింగ్ ను నిలిపివేశారు. పవన్ చేస్తున్న మరో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాలో కీలక పాత్రలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ గౌతమి నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె పవన్ కళ్యాణ్ తల్లి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఈ సినిమాలకు పవన్ తాత్కాలికంగా విరామం ఇచ్చారు. ఎన్నికల తరువాత ఈ సినిమాలన్నీ సెట్ పైకి వచ్చే అవకాశం ఉంది.మరోవైపు రాజకీయాల్లో పవన్ బిజీగా ఉన్నారు. టిడిపి తో పొత్తుతో పాటు అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారు.సరిగ్గా ఈ సమయంలోనే విదేశాల్లో ఉన్న ఓ అభిమాని రాసిన లేఖను చూసి పవన్ కన్నీటి పర్యంతమయ్యారు. తన ట్విట్టర్ ఖాతాలో ఆ లేఖను పోస్ట్ చేశారు.
ఐర్లాండ్ లో షిప్ లో కళాసిగా పని చేస్తున్న నిరుద్యోగ యువకుడు పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. పవన్ కు బాగోద్వేగ లేఖ రాశారు.’ ఎక్కడో బోలీవియా అడవుల్లో అంతమైపోయింది అనుకున్న విప్లవానికి కొత్త రూపాన్ని కనిపెట్టక పోతావా, సరికొత్త గెరిల్లా వార్ ను మొదలెట్టక పోతావా అని? మన దేశాన్ని, కనీసం మన రాష్ట్రాన్ని అయినా మార్చుకోకపోతమా? 17 ఏళ్లుగా ఈ దేశంలో లేకపోయినా.. దేశం మీద ప్రేమతో భారత పౌరసత్వాన్ని వదులుకోలేక ఎదురుచూస్తున్న నాలాంటి వాళ్లందరం, మా కోసం నిలబడుతున్న నీకోసం బలపడతాం.. 2014లో నిలబడ్డాం.. 2019లో బలపడ్డాం.. 2024 లో బలంగా కలబడదాం” అంటూ లేఖ రాశారు. పవన్ తన ట్విట్ లో ఈ లేఖపై భిన్నంగా స్పందించారు. ఈ లెటర్ చదివిన వెంటనే గొంతు దుఃఖంతో పూడుకు పోయిందని.. కన్నీరు తెప్పించావు అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. జన సైనికులు ట్రోల్ చేస్తున్నారు.