Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకటే రాజధాని అనేది జనసేన విధానమని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల వేళ రాజధాని రైతులకు మేలు జరిగే నిర్ణయాలు జనసేన పార్టీ నుంచి ఉంటాయని ఆయన చెప్పారు. సోమవారం మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ని అమరావతి రైతులు కలిశారు. అమరావతి పరిరక్షణ పోరాటం వెయ్యి రోజులు పూర్తవుతున్న సందర్భంగా రెండో విడతగా అమరావతి రైతులు సెప్టెంబర్ 12వ తేదీ నుంచి తలపెట్టిన మహా పాదయాత్రకు పవన్ కళ్యాణ్ మద్దతును కోరారు. ఆ రోజున వెంకటాయపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి శ్రీకాకుళం జిల్లాలోని శ్రీ అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం వరకు మహా పాదయాత్ర సాగుతుందని, ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ జెండా ఊపి ప్రారంభించాలని రైతులు కోరారు.
ఈ సందర్భంగా రైతులతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజకీయ నాయకులే విలన్లు. వారు తీసుకునే నిర్ణయాలే ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నాయి. గతంలో అమరావతిలో పర్యటించినప్పుడు కూడా ఇక్కడ రైతులను నేను స్పష్టంగా అడిగాను. మీరంతా ఇష్టపడే భూములు ఇస్తున్నారా అని నేను అడగగా చాలామంది అవునని చెప్పారు… అయితే కాస్త ఎక్కువ పరిహారం ఇవ్వాలని కోరారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా తయారైన ఆంధ్రప్రదేశ్ కు రకరకాల సమస్యలు వేధిస్తున్నాయి.
ఒక ప్రాంతీయ భావంతో రాష్ట్రం విడిపోతే, మళ్ళీ మూడు రాజధానులు పేరు చెప్పి మళ్లీ ప్రాంతీయవాదాలను తెర మీదకు తీసుకువచ్చే ప్రయత్నం పాలకులు చేస్తున్నారు. అప్పట్లో జస్టిస్ శ్రీ గోపాల గౌడ గారితో రాజధాని విషయంలో సమావేశం జరిపినప్పుడు సైతం మా పార్టీపరంగా మేం ఒక విధానం తీసుకున్నాం. తక్కువ మొత్తంలో మొదట భూమిని తీసుకొని దానిని అభివృద్ధి చేసిన తర్వాత క్రమక్రమంగా అభివృద్ధి విస్తరించుకుంటూ పోవాలి అని భావించాం. ఆ పద్ధతి మంచిదని పెద్దలు కూడా సూచించారు. అయితే తర్వాత అప్పటి ప్రభుత్వాలు తీసుకున్న కొన్ని నిర్ణయాలు… నా దృష్టికి రావడంతో నేరుగా రైతులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నాను.