
విశాఖకు ఎలాగైనా రాజధాని తరలించుకోపోయే పట్టుదలలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉండగా, వరుస పారిశ్రామిక ప్రమాదాలు ఆయనకు తలనొప్పిగా మారాయి. అమరావతి రాజధానిగా కొనసాగించాల్సిందే అని పట్టుబట్టుకొని కూర్చున్న టీడీపీ నేతలకు ఈ ప్రమాదాలు ఆయుధంగా మారుతున్నాయి. ఈ ప్రమాదాలను సాకుగా చూపుతూ ఆ పార్టీ నేతలు విశాఖ రాజధానికి అనువైన ప్రాంతం కాదని, నొక్కివక్కాణిస్తున్నారు. అదే సమయంలో ఇది పూర్తిగా జగన్ ప్రభుత్వం వైఫల్యం అంటున్నారు. ఎల్ జి పాలిమర్స్, సాయినార్ ప్రమాద ఘటనల విషయంలో ద్రోషులపై చర్యలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరించడం వలనే…మరో మారు రాంకీ పార్మా కంపెనీలో ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు.
కాగా జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ప్రమాద ఘటనపై లేఖ ద్వారా స్పందించారు. పవన్ కళ్యాణ్ గాజువాక, పరవాడ పారిశ్రామిక ప్రాంతాల్లో వరుసగా ప్రమాదాలు సంభవించడం ఆందోళన కలిగిస్తుందని అన్నారు. వరుస ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? భద్రతా ప్రమాణాలు ఎందుకు పాటించడంలేదు? ప్రభుత్వం ఎందుకు ఉదాసీనంగా ఉంటోంది? ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నారు? అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరిలోనూ తలెత్తుతున్నాయి అన్నారు. సాల్వెంట్ పరిశ్రమలో ప్రమాదకరమైన, మండే స్వభావం గల ఆయిల్స్ రసాయనాలు నిల్వ చేస్తున్నప్పుడు రక్షణ ఏర్పాట్లు అత్యంత పటిష్టంగా ఉండాలి కదా అని ప్రశ్నించారు. రక్షణ ఏర్పాట్లు సరిగా ఉంటే ప్రమాదం ఎందుకు జరిగిందో ప్రభుత్వం వివరణ ఇవ్వాలి అన్నారు. బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వడంతో పాటు, ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.
విశాఖ ప్రమాదంపై రాజకీయాలు చేయడం భావ్యమా?
పరిశ్రమలలో జరుగుతున్న ఈ వరుస ప్రమాదల వలన జగన్ ప్రభుత్వంపై ముప్పేట దాడి జరుగుతుంది. ఎల్ జి పాలిమర్స్ ఘటనలో విచారణకు ఆదేశించిన సీఎం జగన్, ప్రమాదానికి బాద్యులైన 12మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అది ప్రతిపక్షాల ఒత్తిడి వలన జరిగిన అరెస్టులే, ప్రభుత్వం కంపెనీ యాజమాన్యంతో లాలూచి పడ్డారని ఆరోపిస్తున్నారు. ఇక స్థానిక ప్రజలు కూడా ఈ ప్రమాదాలపై కోపంతో ఉన్నారని తెలుస్తుంది. స్థానిక ఎమ్మెల్యే అదీప్ రాజ్ పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. సదరు వీడియోలను ప్రదర్శిస్తూ ప్రతిపక్షాలు విమర్శల ఉదృతి పెంచారు.