Varahi : పవన్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారా? జూన్ నుంచి రాజకీయ దండయాత్ర ప్రారంభించనున్నారా? వారాహి యాత్ర మొదలుపెట్టనున్నారా? ఇందుకు సంబంధించి గ్రౌండ్ వర్క్ ప్రిఫేర్ చేసుకున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉభయగోదావరి జిల్లా పంట నష్టపోయిన రైతులను పరామర్శించిన తరువాత పవన్ మీడియాతో మాట్లాడారు. జూన్ నుంచి మరింత క్షేత్రస్థాయిలో తిరుగుతామని ప్రకటించారు. దీంతో వారాహి యాత్రకు సిద్ధపడుతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. వైసీపీపై క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తానని ప్రకటించడం ద్వారా ఇక తాను యాత్రలకు సిద్ధపడుతున్నట్టు స్పష్టం చేశారు.
వాహనం చుట్టూ వివాదాలు…
వారాహి ప్రచార రథం ఎప్పుడో సిద్ధమైంది. దీని చుట్టూ ముసురుకున్న వివాదాలు అన్నీఇన్నీ కావు. వాహనం రహదారిపైకి రాకముందే బహుళ ప్రాచుర్యం పొందింది. వైసీపీ నేతల నానా యాగీ ఇందుకు కారణం.వాహనం ఆర్మీ రంగుల్లో ఉందని.. అది నిబంధనలకు విరుద్ధమని వైసీపీ సోషల్ మీడియా కోడై కూసింది. అటు కొందరు మంత్రులు, నేతలు సైతం అతిగా స్పందించారు. వారాహి వాహనాన్ని ఏపీలో తిరగనివ్వమని హెచ్చరించారు. దీనిపై పవన్ స్పందించారు. ఎలా అడ్డుకుంటారో చూస్తానని హెచ్చరించారు. దీంతో వైసీపీ మంత్రులు, నాయకులు తోక ముడిచారు.
ఎప్పటికప్పుడు బ్రేక్
అయితే వారాహి యాత్రకు ఎప్పటికప్పుడు బ్రేక్ పడుతూ వస్తోంది.పవన్ సినిమాల్లో బిజీగా ఉండడంతో యాత్ర జాప్యం జరుగుతూ వస్తోంది. అదిగో ఇదిగో షెడ్యూల్ అంటూ పుకార్లు షికార్లు చేస్తూ వచ్చాయి. కానీ యాత్ర ప్రారంభం కాలేదు. తొలుత వారాహి వాహనానికి కొండగట్టు, అనంతరం విజయవాడ ఇంద్రకీలాద్రిలో పవన్ పూజలు చేశారు. మార్చిలో జరిగిన జనసేన ఆవిర్భావ సభకు పవన్ వారాహి వాహనంపై వచ్చారు. దీంతో యాత్రపై స్పష్టమైన ప్రకటన చేస్తారని అభిమానులు ఆశించారు. కానీ ఎటువంటి ప్రకటన రాలేదు. దీంతో ఇప్పట్లో యాత్ర చేయరని అంతా భావించారు. కానీ ఇప్పుడు పవన్ క్లారిటీ ఇచ్చారు.
కసరత్తు షురూ..
ఎన్నికలు సమీపిస్తున్నాయి. పొత్తులు కచ్చితంగా ఉంటాయని పవన్ తేల్చిచెప్పారు. తమకు బలమున్నచోట మాత్రమే పోటీచేస్తామని చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో వారాహి యాత్ర పరిమిత నియోజకవర్గాల్లో చేపడతారా? లేకుంటే పొత్తు ధర్మం పాటించి కూటమి అభ్యర్థుల తరుపున రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తారా? అన్నదానిపై క్లారిటీ లేదు. అయితే జూన్ నుంచి క్షేత్రస్థాయిలో పర్యటనలకు దిగుతామని చెప్పడం ద్వార పవన్ పార్టీ శ్రేణులకు ఒకరకమైన మెసేజ్ ను మాత్రం పంపించగలిగారు. కచ్చితంగా జూన్ నుంచి వారాహి యాత్ర ఉంటుందని జన సైనికులు నమ్మకంగా చెబుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరీ.