Pawan Kalyan Bus Yatra: తన బలం ఏంటో.. బలహీనత ఏంటో పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారు. అందుకే ఇప్పుడు దసరా నుంచి ఏపీ ప్రజల్లోకి వెళుతున్నారు. 2019 ఎన్నికల్లో ఓటమిని విశ్లేషించుకున్న పవన్ ఈసారి ఏపీలో అధికారమే లక్ష్యంగా సాగుతున్నారు. బస్సు యాత్రతో జిల్లాల్లో చేరికలు బాగా నిర్వహించి.. పార్టీని క్షేత్రస్తాయి నుంచి బలోపేతమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.

పాదయాత్ర అయినా.. బస్సు యాత్ర అయినా అది కనీసం ఆరేడు నెలల పాటు వ్యయప్రయాసలకు ఓర్చి చేయాల్సి ఉంటుంది. అన్ని చోట్ల సక్సెస్ ఫుల్ గా సాగాలంటే నేతలు, కార్యకర్తల బలం చాలా అవసరం.. అందుకే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇతర పార్టీల నుంచి చేరికలకు తెరతీశారు. ప్రతీరోజు ఏపీ నుంచి వస్తున్న నేతలు జనసేనాని సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. జిల్లాల్లో పట్టున్న వారు.. జిల్లా రాజకీయాలను శాసించేవారు పవన్ వైపు వస్తుండడంతో ఆ పార్టీ బలం అమాంతం పెరుగుతోంది.
ఉత్తరాంధ్ర నుంచి గట్టి నేతలు జనసేనలో చేరికకు రెడీ అయ్యారట.. వైసీపీలోని టికెట్ ఆశిస్తున్న ద్వితీయ శ్రేణి నేతలంతా జనసేన వైపు చూస్తున్నారు. ఎమ్మెల్యే తరువాత చక్రం తిప్పే వారంతా జనసేనలో చేరి టికెట్ సంపాదించి గెలవాలని చూస్తున్నారు. ఒకనాడు ఎమ్మెల్యేగా, మంత్రులుగా చేసి ఇప్పుడు ప్రాధాన్యం దక్కని వారికి జనసేన పెద్ద దిక్కు అవుతోంది. దక్షిణ కోస్తా, రాయలసీమ నుంచి కూడా నేతలు పెద్ద ఎత్తున చేరేందుకు రెడీ అవుతున్నారు.

వైసీపీ, టీడీపీలోని అసంతృప్తులందరికీ ఇప్పుడు జనసేననే దిక్కు అవుతోంది. ఈ క్రమంలోనే పవన్ బస్సు యాత్రలో వీరందరి చేరికలకు వ్యూహాలు సిద్ధం చేసినట్టు సమాచారం. అందుకే ఇప్పుడే హైదరాబాద్ కు రప్పించి వారికి టికెట్ భరోసా కల్పించి ఫలానా తేదీల్లో పార్టీ చేరాలని పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట పవన్. ఏపీలో పొత్తులు పెట్టుకున్నా.. పెట్టుకోకున్నా ఈసారి ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్న తీరుగా పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నారు. ఆయన ప్రయత్నాలు ఎంత మేరకు ఫలిస్తాయన్నది వేచిచూడాలి.