Pawan Kalyan: ‘కర్తవ్య పథ్ ‘.. భారతీయత ఉట్టిపడే నామధేయం. బ్రిటీష్ పాలనలో కింగ్స్ వే .. ఆ తరవాత రాజ్ పథ్ గా మారి ఇప్పుడు కర్తవ్య పథ్ గా అవతరించింది. బ్రిటీష్ రాచరిక పాలన అంతరించి 75 ఏళ్ళు గడిచినా వారి వలసవాద పాలనకు ఇంకా మానని గాయాలుగా మిగిలిన సజీవ గుర్తులను తుడిచివేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీగారికి అభినందనీయులు.’ అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంకల్పంతో వలసవాద పాలనలో ఉద్భవించిన పేర్లు మరియు చిహ్నాలను తొలగించాలని ప్రధాని మోదీ గారు ఉద్ఘాటించారు. ఆ వాగ్దానాన్ని అమలు చేస్తుండడం హర్షణీయమని ప్రశంసించారు.

న్యూఢిల్లీలోని ప్రధాని అధికారిక నివాసం ఉండే వీధిని రేస్ కోర్స్ గా పిలిచేవారు. ఇప్పుడు లోక్ కళ్యాణ్ మార్గ్‌గా నామకరణం చేశారు. అదే విధంగా భారతీయ వాయుసేన పతాకంలో సెయింట్ జార్జ్ క్రాస్ ఉండేది. దాని స్థానంలో నూతన పతాకాన్ని మోదీ గారు ఆవిష్కరించారు. ఈ గుణాత్మక చర్యలు బానిసవాదాన్ని నిర్మూలించే అభ్యుదయ చర్యలుగా భావిస్తున్నాను.
ఈ సందర్భంగా ప్రధాని మోదీకి నాదొక విన్నపమని… కర్తవ్య పథ్ లో సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ విగ్రహాన్ని ఆవిష్కరించి ఆ మహా వీరుని పట్ల మీకున్న భక్తిభావాన్ని చాటుకున్నారన్నారని పవన్ కళ్యాణ్ కొనియాడారు. మీ చేతుల మీదుగానే జపాన్ లో భద్రపరచిన నేతాజీ అస్థికలను కూడా రప్పించవలసిందిగా కోరుతున్నానని.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనుమరాలు రాజశ్రీ చౌదరీ బోస్ గారి అనుమతితో ఆమె డి.ఎన్.ఏ.తో వాటిని సరిపోల్చవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. ఇది సాకారమైతే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లక్ష్యం సిద్ధిస్తుందన్నారు.. భారత జాతి విముక్తి కోసం పోరాడిన ఆ మహనీయునికి నివాళిగా మిగిలిపోతుందని భావిస్తున్నానని తెలిపారు.