Pawan Kalyan
Pawan Kalyan: పవన్ దూకుడు పెంచారు. స్థానిక సంస్థలపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. నిర్వీర్యమైపోతున్న పంచాయతీ వ్యవస్థను కాపాడేందుకు నడుం బిగించారు. గత కొద్దిరోజులుగా పోరాడుతున్న సర్పంచులకు మద్దతుగా నిలిచారు. పంచాయతీలకు విధులు,నిధులు ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. మంగళగిరిలోనే పార్టీ కేంద్ర కార్యాలయంలో సర్పంచులతో సమావేశం అయ్యారు. సమావేశానికి అధికార పార్టీ సానుభూతిపరులైన సర్పంచులు కూడా రావడం విశేషం.
విధులు,నిధుల కోసం గత కొన్నేళ్లుగా పంచాయతీ సర్పంచులు పోరాటం చేస్తున్నారు. కేంద్ర ఆర్థిక సంఘం, పంచాయతీ ప్రత్యేక నిధులను పక్కదారి పట్టించడం తదితర వంటి వాటిపై సర్పంచులు పోరాట బాట పట్టారు. పాలకవర్గాలకు తెలియకుండా నిధులు మళ్లింపు పై ఆగ్రహంగా ఉన్నారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించడం లేదు. చివరకు అధికార పార్టీ సానుభూతిపరులైన సర్పంచులు సైతం ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకరిద్దరు బాహటంగానే నిరసన వ్యక్తం చేస్తూ తమను తాము శిక్షించుకున్నారు. తమ చెప్పులతో తామే కొట్టుకొని ఆవేదన వెలిబుచ్చారు. ఇటీవల వైసిపి సానుభూతిపరుడైన ఓ సర్పంచ్ ప్రతినిధి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కొద్దిరోజుల కిందట రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన సర్పంచులపై పోలీసులు ఉక్కు పాదం మోపారు. లాఠీచార్జ్ చేసి తరిమి కొట్టారు. ఈ పరిణామంతో అధికార పార్టీ సర్పంచులు సైతం తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. జగన్ సర్కార్ తమను అన్ని విధాలా మోసం చేసిందని లోలోపల రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆశాదీపం లా మారారు. అండగా నిలవడానికి ముందుకు వచ్చారు.
జనసేన అధికారంలోకి వస్తే.. పంచాయితీ వ్యవస్థ ను బలోపేతం చేస్తానని పవన్ చెబుతున్నారు. రాజ్యాంగబద్ధంగా పంచాయతీలకు వచ్చే నిధులను మళ్లించే చర్యలను నియంత్రిస్తామని హామీ ఇచ్చారు. సర్పంచులకు జీవిత బీమా సౌకర్యం కల్పిస్తామని.. జనసేన మేనిఫెస్టో లోనే పొందుపరుస్తామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో పాలన దారుణంగా ఉందని వ్యాఖ్యానించారు. చివరకు అధికార పార్టీ సర్పంచులు సైతం రోడ్డుపైకి వచ్చే ఆందోళన చేస్తుండడం దౌర్భాగ్య స్థితిని తెలియజేస్తోందన్నారు
. జనసేన అధికారంలోకి వస్తే పంచాయితీల పరిపుష్టికి తమ వంతు కృషి చేస్తామని పవన్ సర్పంచులకు హామీ ఇచ్చారు. కాగా పవన్ తాజా చర్యలతో.. ఎక్కువమంది సర్పంచులు జనసేనకు అనుకూలంగా మారుతున్నారు. ఇది సానుకూల అంశంగా జన సైనికుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.