
మతాలకు భిన్నంగా, కులాలకు అతీతంగా, అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తూ.. అన్ని సంప్రదాయాలను గౌరవిస్తూ.. అవినీతి రహిత రాజకీయాలను ప్రజలకు చూపించాలని, ఎన్నో ఆశలతో, ఆశయాలతో, సరికొత్త విధి విధానాలతో బలమైన సంకల్పంతో మర్చి 14, 2014లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “జనసేన” అనే పార్టీని స్థాపించిన విషయం అందరికి తెలిసిందే.. అనేక ఆటుపోట్లను ఎదురుకొని ఇప్పటి వరకు పార్టీని నడిపించారు. కానీ ఈ మధ్య కాలంలో పవన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆ పార్టీని ఒక మతానికి దగ్గర చేసినట్లుగా తెలుస్తుంది. ఒక మతానికి ఆ పార్టీని ఆపాదించడం అనేది రాత్రికి రాత్రే జరిగిన తంతు కాదు. ఒక్కసారి గతంలోకి వెళ్తే.. పూర్తి వివరాలు బయటకు వస్తాయి.
2019 నవంబర్ లో హిందూ పుణ్య క్షేత్రాల్లో అన్య మత ప్రచారం పెరుగుతున్న తీరును జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తప్పుపట్టిన సంగతి తెలిసిందే. విజయవాడ పుష్కర ఘాట్‌లో సామూహికంగా బాప్టిజమ్ ఇవ్వడాన్ని తప్పుబడుతూ జనసేన ఒక వీడియోను కూడా విడుదల చేసింది. ఈ విషయంపై ఆ సమయంలో తెలుగు రాష్ట్రాలలో పెద్ద దుమారమే రేగింది. అనేకమంది క్రైస్తవులు, పవన్ తీరును ఖండించారు. అదే సమయంలో పార్టీ స్థాపనకు సహకరించిన వారు, పవన్ తో చాలా సన్నిహితంగా ఉన్న ( ఆలివర్ రాయ్, రాజురవితేజ్ వంటి) కొంతమంది జనసేన అభ్యర్థులు పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోవడం జరిగింది. ఈ సంఘటనలతో “జనసేన పార్టీ, క్రైస్తవులకు విరుద్ధం” అనే ముద్రవేశారు.
అలాగే ఈ మధ్య కాలంలో జనసేన విడుదల చేసే కొన్ని అధికారిక పోస్టులకు “జై జగన్మాత” అనడం కూడా జరుగుతుంది. దీనికి తోడు బీజేపీతో పొత్తుపెట్టుకోవడం కూడా జరిగింది. ఈ పోత్తు వల్ల దేశంలో ఎక్కువ శాతం వ్యతిరేకించే.. సిఏఏ, ఎన్ఆర్సి వంటి బిల్లులకు మద్దతు ప్రకటించడం, ఆ విషయంపై బహిరంగంగా మాట్లాడటం జరుగుతుంది. తత్ఫలితంగా.. “జనసేన పార్టీ, ముస్లిములకు వ్యతిరేకం” అనే ముద్రవేశారు.
పైన తెలిపిన కారణాల వల్ల, క్రైస్తవుల, ముస్లింల మనోభావాలను దెబ్బ తీసే విధంగా పవన్ ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తుంది. అటు క్రైస్తవులకు, ఇటు ముస్లింలకు జనసేన విరుద్ధమో.. కాదో అనేది అప్రస్తుతం. కానీ, ఆ పార్టీ హిందూ సిద్ధాంత పార్టీ అనే ముద్రను వేసుకోవాల్సి వచ్చింది.