Janasena: జనసేనాని పవన్ కళ్యాణ్ 2024 ఏపీ ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే మొదటగా పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు నడుం బిగించారు. ఉగాది తర్వాత జనసేన నియోజకవర్గాల వారీగా సమీక్షకు నిర్ణయించారు. పవన్ కళ్యాణ్ నేతృత్వంలో క్రియాశీలక సభ్యత్వ నమోదుకు రెడీ అయ్యారు. ఈ మేరకు నాయకుల పని తీరు పరిశీలనకు సిద్ధమయ్యారు. క్రియాశీల సభ్యత్వ సమన్వయ వాలంటీర్ల సమావేశంలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ మేరకు జనసేన పార్టీ కార్యాచరణను ప్రకటించారు.
ఉగాది తరవాత నుంచి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేపట్టనున్నట్టు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. రెండో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియతోపాటు పలు అంశాలు చర్చిస్తామన్నారు. నియోజకవర్గాల వారీగా అభ్యర్ధులు, ఇంఛార్జులు, జిల్లా అధ్యక్షుల పని తీరు మదింపు ఉంటుందని చెప్పారు. నియోజకవర్గాల వారీగా నాయకుల పని తీరుని అంచనా వేసేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒక ఇండికేటర్ గా తీసుకున్నట్టు చెప్పారు.
మంగళవారం హైదరాబాద్ ప్రశాసన్ నగర్ లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియను సమన్వయం చేస్తున్న వాలంటీర్లతో పార్టీ కోశాధికారి శ్రీ ఎ.వి.రత్నంతో కలసి సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “పార్టీ క్రియాశీలక సభ్యత్వాన్ని అన్ని జిల్లాల్లో, గ్రామాల్లో అందించే విధంగా కనీవినీ ఎరుగని రీతిలో అద్భుతంగా ముందుకు తీసుకువెళ్లారు. పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున, పార్టీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు. ఈ ప్రక్రియ మొదలుపెట్టినప్పటి నుంచి మనం అనుకున్నది ఒకటే.. పార్టీ శ్రేణుల్లో ఉన్న ఉత్సాహాన్ని, శక్తిని సరైనరీతిలో వినియోగించుకోవాలి. అనేక కారణాల చేత చాలా మందికి పూర్తి స్థాయి అవకాశాలు కల్పించలేకపోతున్నాం.
కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు అంతా మొట్టమొదట అడిగిన పాయింటు ఒకటే.. ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని కొన్ని రోజులు పొడిగించమని కోరారు. దాన్ని పరిగణలోకి తీసుకుని మరో దఫా అవకాశం ఇవ్వాలని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ చాలా లిబరల్ గా ఉండాలి. అందరికీ అవకాశం కల్పించాలి. ఈ కార్యక్రమం కొంత మంది కోసమే పెట్టింది కాదు. జనసేన పార్టీ జిల్లాల్లో ఎలా ఉంది. నియోజకవర్గాల్లో ఎలా ఉన్నాం. బలంగా ఉన్నామా లేదా? ఎక్కడ మనకు బలహీనతలు ఉన్నాయి. ఎక్కడ పొరపాట్లు జరుగుతున్నాయి. నాయకులు సరిగా పని చేస్తున్నారా లేదా? ఈ సమాచారం మొత్తం వాలంటీర్ల ద్వారానే పవన్ కళ్యాణ్ గారికి చేరాలి.
రెండో విడత కార్యక్రమంలో రోజువారీ సమాచారం మొత్తం క్రోడీకరించి ఎప్పటికప్పుడు అందించండి. ఆ సమాచారాన్ని లోతుగా పరిశీలించుకుని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తే ఏ జిల్లాలో ఎవరు ఎలా పని చేస్తున్నారు.. ఏ నియోజకవర్గంలో పని తీరు ఎలా ఉంది అనే అంశం మీద స్పష్టత వస్తుంది. మనకు బలం ఉన్నప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో ఏ కారణంతో సభ్యత్వాలు చేయలేకపోయాం అనేది స్పష్టంగా అర్ధం అవుతుంది. బలం ఉన్నా ఎందుకు ఆగిపోతున్నామో తెలుస్తుంది. కొన్ని నియోజకవర్గాల్లో తూతూ మంత్రంగా ఓ వెయ్యి సభ్యత్వాలు చేసి ఊరుకున్నారు. అందుకు కారణం ఏంటో తెలియాలి. పార్టీ అభివృద్ధిని, భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని మరికొంత మెరుగైన సమాచారం అందేలా చూడండి. గతంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రమే ఆ సమాచారాన్ని పార్టీకి అందించే వారు. రెండో విడత అక్కడ నాయకత్వ పనితీరుని అంచనా వేయాలని భావిస్తున్నాం. క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వాలంటీర్లుగా ముందుకు వచ్చిన అందర్నీ అభినందిస్తున్నాను అన్నారు.