
Pawan Kalyan- Jagan: జగన్ అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నారు. ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నారు. ముందస్తుకు వెళ్లాలా? లేకుంటే షెడ్యూల్ సమయం వరకూ ఆగాలా? అన్నది తేల్చుకోలేకపోతున్నారు. ముందస్తుకు వెళితే కలిసొచ్చేది ఏంటి? షెడ్యూల్ సమయం వరకూ ఆగితే జరిగే నష్టాలేంటి అని భేరీజు వేసుకుంటున్నారు. మొన్నటివరకూ అంతులేని ధీమాతో ఉండేవారు. వై నాట్ 175. కుప్పంలో సైతం గెలిచి తీరుతామని కాలర్ ఎగురేశారు. కానీ అటు కీలకమైన రాయలసీమ, ఉత్తరాంధ్రలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో ప్రతికూల ఫలితాలు రావడంతో పునరాలోచనలో పడిపోయారు. అంతకంటే ముందు విపక్షాల మధ్య ఐక్యత జగన్ ను కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైనే ఆశలు పెట్టుకున్నారు. ఆయన నిర్ణయంతోనే తన రాజకీయ భవిష్యత్ ఉందని బలంగా నమ్ముతున్నారు.
రెండు పార్టీలు కలిస్తే కష్టమే…
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి నడుస్తాయన్న ప్రచారం ఉంది. రెండు పార్టీల మధ్య సానుకూల వాతావరణం కూడా ఉంది. ఆ రెండు పార్టీలు కలిస్తే ఏకపక్ష ఫలితాలు వస్తాయని విశ్లేషణలు ఉన్నాయి. అందుకే ఆ రెండు పార్టీలు కలవకూడదు అని జగన్ బలంగా ప్రయత్నించారు. మధ్యలో బీజేపీ పెద్దలను పెట్టి జనసేనను అదుపు చేయాలని ప్రయత్నించినట్టు వార్తలు వచ్చాయి. అలాగని జనసేన నేరుగా టీడీపీతో పొత్తుల ప్రకటన చేయలేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలిపోనివ్వనని మాత్రమే చెబుతూ వస్తున్నారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు, పార్టీలో క్రమశిక్షణ కట్టుదాటుతుండడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం తదితర కారణాలతో ముందస్తుకు వెళ్లాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అయితే అది పవన్ తీసుకోబోయే నిర్ణయం బట్టి ఆలోచన చేయనున్నట్టు తెలుస్తోంది. జనసేన టీడీపీతో కలిస్తే ముందస్తుకు.. కలవకుంటే షెడ్యూల్ సమయం వరకూ వెయిట్ చేయాలని జగన్ చూస్తున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.
ధైర్యం సడలడంతోనే…
వాస్తవానికి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నా సంక్షేమంతో అధిగమిస్తామన్న ధీమా జగన్ లో ఉండేది. పైగా విపక్షాల మధ్య అనైక్యత తనకు కలిసి వస్తుందని భావించారు. అంతులేని ఆత్మవిశ్వాసం ప్రదర్శించారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురైన పరాభావం అతడిలో ఉన్న స్థైర్యాన్ని దెబ్బతీసింది. ధైర్యం సడలింది. ఎంత వేగం గా ఎన్నికలకు వెళితే అంత నష్టం నుంచి తప్పించుకోవచ్చని భావించారు. అందుకే ఇప్పటివరకూ అండగా నిలిచిన ఐ ప్యాక్ టీమ్ ను సైతం పక్కన పడేశారు. సొంత వ్యూహాలకు పదును పెట్టడం ప్రారంభించారు. అదే సమయంలో పవన్ ముఖ్యమంత్రి కావాలని జన సైనికులు బలంగా కోరుకుంటున్నారు. ఈ డిమాండ్ తోనే టీడీపీ, జనసేన మధ్య దూరం పెంచాలని వైసీపీ భావిస్తోంది. పవర్ షేరింగ్ కు టీడీపీ ఒప్పుకునే చాన్స్ లేకపోవడంతో జనసేన విడిగా పోటీ చేస్తుందన్నది వైసీపీ భావన. అయితే పవన్ మనసులో ఏముందో తెలియడం లేదు. కానీ వైసీపీ విముక్త ఏపీ నినాదంతో పవన్ బలంగా ముందుకెళుతున్నారు.
సోషల్ మీడియాలో విష ప్రచారం..
ఎలాగైనా పొత్తుకు జనసేనను దూరంగా ఉంచడానికి వైసీపీ చేయని ప్రయత్నం లేదు. జనసేనపై వైసీపీ సోషల్ మీడియా విభాగం ఒక విష ప్రచారానికి దిగింది. టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదరుతుందన్న వార్తల నేపథ్యంలో ఫేక్ ఐడీలతో పొత్తులు, సీట్లు అంటూ ఇరు పార్టీల నేతల మధ్య చర్చలు జరిగినట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది, చివరకు కొన్ని టీవీ చానళ్ల లోగోలతో స్క్రోలింగ్ వస్తున్నట్టు చూపి రెండు పార్టీల మధ్య అగాధం సృష్టించేందుకు ప్రయత్నం చేస్తోంది. జనసేన తక్కువ సీట్లతో సర్దుబాటు చేసుకుందంటూ ప్రచారం చేస్తోంది. దీంతో జన సైనికులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. జనసేన యాక్టివ్ నాయకులతో మాట్లాడారు. వైసీపీ మైండ్ గేమ్ లో భాగమని.. పొత్తుల వ్యూహాలు పార్టీలో చర్చిస్తామని పవన్ పేర్కొన్నట్టు సమాచారం.

పవన్ పై బేస్ కావడంపై విస్మయం…
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తరువాత వైసీపీలో నిరుత్సాహం అలుముకుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా పవన్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.మరోవైపు వామపక్షాలు సైతం వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశాయి. టీడీపీకి రెండో ప్రాధాన్యత ఓట్లు వేసి విజయానికి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో జనసేన, టీడీపీ, వామపక్షాలు కూటమి కడతాయన్న ప్రచారం ఊపందుకుంది. ముఖ్యంగా టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తే తమకు ప్రతికూల ఫలితాలు రావడం ఖాయమని వైసీపీ నేతలు డిసైడయ్యారు. అందుకే సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలను ప్రోత్సహిస్తున్నారు. అయితే ఇప్పటివరకూ తనకు అంతులేని ప్రజాబలం ఉందని చెప్పుకొచ్చిన జగన్.. ఇప్పుడు పవన్ తీసుకునే నిర్ణయంపైనే బేస్ కావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీసం పవన్ ను నాయకుడిగా కూడా ఒప్పుకునేందుకు ఇష్టపడని జగన్ చర్యలు చూసి సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.