
Pawan Kalyan Varahi: ఏపీ రాజకీయం యాత్రల చుట్టూ తిరుగుతోంది. ఇప్పటికే నారా లోకేష్ పాదయాత్ర పేరుతో నడుస్తున్నారు. అప్పుడప్పుడు జగన్ పరదాల అండతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇక మిగిలింది జనసేనాని పవన్ కళ్యాణ్. ఆయన వారాహి యాత్ర ఎప్పుడు మొదలవుతుందన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. కానీ పవన్ కళ్యాణ్ యాత్ర .. ఎప్పుడు మొదలు పెట్టామన్నది కాదు.. ఎంత ప్రభావం చూపామన్నదే ముఖ్యం అన్నట్టు ఉండబోతుందని టాక్. ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు ఇదే టాక్ ఆఫ్ ది టౌన్.
ఏపీ రాజకీయాల్లో పాదయాత్రలు, వాహనయాత్రలు కొత్తకాదు. కానీ పరదాలు అడ్డుగా కట్టి యాత్రలు చేయడమే కొత్త. సీఎం జగన్ రెడ్డి ఎక్కడ సభ పెట్టినా.. అక్కడ పరదాలు దర్శనమిస్తాయి. ఇన్నాళ్లు వ్యాపారం లేదని లబోదిబోమంటున్న పరదాల వ్యాపారులకు జగన్ రూపంలో గిరాకీ కలిసొచ్చిందట. జగన్ పుణ్యాన బాగానే వ్యాపారం జరుగుతోందట. కానీ జగన్ అప్పుడప్పుడు మాత్రమే పర్యటనలకు వెళ్తున్నారు. అలా కాకుండా లోకేష్ లా రోజూ తిరిగితే తమ వ్యాపారానికి ఢోకా ఉండదని పరదాల వ్యాపారాలు ఆశిస్తున్నారట.

నారా లోకేష్ పాదయాత్రను ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెడుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ యాత్ర మొదలుపెడితే వైసీపీకి నిద్రపడుతుందో లేదో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆచితూచి అడుగులేస్తున్నారు. ఇంకా ఎన్నికలకు సమయం ఉన్నందున వారాహి యాత్రను ఆలస్యంగానే ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతలోపు పార్టీ నిర్మాణాన్ని పటిష్ఠం చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగా ఇటీవల క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగవంతం చేశారు. ఇప్పటి నుంచి రోజూ తిరగడం కన్నా.. ఎన్నికలకు 7,8 నెలల ముందు నుంచి కార్యక్షేత్రంలోకి దూకాలని భావిస్తున్నారు. అదేదో సినిమా డైలాగ్ ఉన్నట్టు.. ఎప్పుడొచ్చామని కాదు, ప్రభావం చూపామా .. లేదా అన్నదే ముఖ్యం అన్నట్టు పవన్ కళ్యాణ్ వారాహియాత్ర ఉండబోతోంది.
ఇప్పటికే నారాలోకేష్ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ప్రభావం అంతంత మాత్రమే ఉంది. నారా లోకేష్ పాదయాత్ర ఒకవైపు.. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మరోవైపు మొదలైతే.. ఇక ఏపీ ప్రభుత్వానికి చుక్కలు కనిపిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఇప్పటికే అధికంగా ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ యాత్రకు భారీ స్థాయిలో మద్దతు లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రసంగాలు ప్రజలను ఉర్రూతలూగించడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల ముందు వరకు రాజకీయ కార్యక్రమాలు నిర్వహించాలని జనసేన భావిస్తోంది. ఎన్నికలకు ఆర్నెల్ల ముందు నుంచి పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి విస్త్రతంగా వెళ్తారని తెలుస్తోంది. తద్వార ప్రజల్లో బలమైన ముద్ర వేయాలని జనసేన ఆలోచిస్తోంది.