Pawan Kalyan: పార్టీ ప్రక్షాళనకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పూనుకుంటున్నారు. పనితనమే ప్రధానంగా కీలక పదవులు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. ఇన్నాళ్లు పార్టీని నమ్ముకుని ఉన్న నేతలకు ఉపశమనం కలిగేలా వారిని పదవుల్లో ఉంచాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే పార్టీ బలోపేతం దిశగా చర్యలు తీసుకుంటున్నారు. జనసేన ఇక ప్రజల్లో మమేకం కావాలని ఆశిస్తున్నారు. ప్రజాసేవ చేస్తూ ప్రజల్లోనే ఉంటూ వారిని ఓట్లు అడిగే లా ప్రణాళికలు రచిస్తున్నారు. దీనికిగాను ఇప్పటికే పలు కార్యక్రమాలు రూపొందించినట్లు తెలుస్తోంది.

పార్టీకి పట్టున్న తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, విశాఖపట్నం వంటి చోట్ల పార్టీ అభ్యర్థులను ఖరారు చేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లి పనిచేయాలనే ఉద్దేశంతోనే ఈ మేరకు నిర్ణయించినట్లు సమాచారం. ముందే అభ్యర్థులను ప్రకటిస్తే ప్రజల్లో కలిసి వారితోనే పని చేసే అవకాశం కలుగుతుందని భావిస్తున్నారు. త్వరలోనే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తానని పేర్కొన్నారు.
పార్టీని గాడిలో పెడతారని భావించి పార్టీలోకి తీసుకున్న నేతలు పార్టీని వదిలి వెళ్లడంతో పవన్ కల్యాణ్ ఆలోచనలో పడ్డారు. జేడీ లక్ష్మీనారాయణ, మాదాసు గంగాధరం వంటి నేతలు పార్టీని వీడడంతో ఇక ఎవరు కూడా పార్టీని వదిలి వెళ్లొద్దనే ఉద్దేశంతో వారికి పదవులు కేటాయించాలని చూస్తున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారిని తప్పకుండా గుర్తించి వారిని గౌరవిస్తామని చెబుతున్నారు. ఇందులో భాగంగానే వారికి రాయల్టీ పదవులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
పార్టీని జిల్లా, మండల, గ్రామస్తాయిలో బలోపేతం చేసే దిశగా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. జనసేన జెండా జనంలోనే ఉండాలని పవన్ కల్యాణ్ ఆలోచిస్తున్నారు. దసరా తరువాత పార్టీని అన్ని ప్రాంతాలకు విస్తరించే పనిలో భాగంగా పలు కార్యక్రమాలు చేపట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. అన్ని పార్టీలకు దీటుగా జనసేన బలం పెంచుకోవాలని చూస్తున్నారు.