Pawan Kalyan Kotamreddy : ఏపీలో అధికార వైసీపీని నెల్లూరు పెద్దారెడ్లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్న వారు ధిక్కార స్వరం వినిపించారు. ఒక పద్ధతి ప్రకారం అధికార పార్టీని, అధినేతను, కీలక నేతలను ఇరుకునపెడుతున్నారు. అయితే వారిని నియంత్రించే క్రమంలో ప్రభుత్వ చర్యలు మాత్రం మరీ ఎబ్బెట్టుగా ఉన్నాయి. ప్రత్యామ్నాయంగా నాయకులను తెరపైకి తేవడం వరకూ పర్వాలేదు. కానీ ఏకంగా వారికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తున్నారు. యంత్రాంగాన్ని వారి చేతిలో పెడుతున్నారు. నిన్నటివరకూ ఉన్న భద్రతా సిబ్బంది, గన్ మెన్లను తొలగిస్తున్నారు. దీంతో సదరు రెబల్ ఎమ్మెల్యేలు తమకు ప్రాణహాని ఉందని ప్రకటించుకునే వరకూ పరిస్థితి వచ్చింది.

సహజంగా అధికార వైసీపీ శ్రేణుల్లో దూకుడు ఎక్కువ. కిందిస్థాయి నుంచి సలహదారుల వరకూ ఒకటే బాణి. రాజకీయ ప్రత్యర్థులను తూలనాడడం, బెదిరింపులు, దూషణలకు దిగడం వారికి తెలిసినట్టుగా మరెవరికీ తెలియదు. ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడిన మరు క్షణం నుంచే మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని టార్గెట్ చేశారు. ఆయనకు ప్రత్యామ్నాయంగా నేదురమల్లి రాంకుమార్ రెడ్డిని తెరపైకి తెచ్చారు. సోషల్ మీడియాలో ఆయనపై అభ్యంతరకర పోస్టులు, కామెంట్లు పెడుతున్నారు. ఇక బెదిరింపు కాల్స్ సైతం అన్నీఇన్నీకావు. మరో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిది సేమ్ సీన్. ఏకంగా ఆయన ఫోన్ ట్యాంపర్ చేశారని ఆరోపిస్తున్నారు. ఇందులో ప్రభుత్వ పెద్దలుగా భావించే సలహాదారుల పాత్ర ఉందని చెబుతున్నారు. అనుమానించిన పార్టీలో ఉండలేనని చెప్పి మరీ బయటకు వచ్చారు. దీంతో ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. కడపకు చెందిన బురగడ్డ అనిల్ అనే నాయకుడి బెదింపు ఫోన్ కాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇటువంటి ప్రతికూల సమయంలో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కుదించింది. మరోవైపు బెదిరింపు కాల్స్ వస్తుండడంతో సహజంగా భయపడాల్సిన పరిస్థితి. అందుకే ఆనం రామనారాయణరెడ్డి ఏకంగా తనకు ప్రాణహాని ఉందని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. తమ దయనీయ పరిస్థితిని చెప్పారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ స్పందించారు. ఆనం రామానారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మద్దతుగా ప్రభుత్వానికి అల్టిమేటమ్ ఇచ్చారు.సుదీర్ఘ రాజకీయ అనుభవం..హుందా గల నేతగా రామనారాయణరెడ్డికి మంచి పేరుందన్నారు. అటువంటి నేత తనకు ప్రాణ హాని ఉందని ఆందోళన వ్యక్తం చేయటం చూస్తుంటే రాష్ట్రంలో ప్రతీకార రాజకీయాలు పరాకాష్టకు చేరాయని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. శాసనసభ్యులే ప్రాణ హాని తో భయపడే పరిస్థితులు వచ్చాయని..మిగిలిన ప్రజా ప్రతినిధుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.దీనిపై డీజీపీ స్పందించి భద్రత చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకుంటే కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తానని కూడా చెప్పారు.
అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు భయంతో ఉన్నారని..స్వేచ్ఛగా మాట్లాడుకొనే పరిస్థితి లేదని పవన్ ఎద్దేవా చేశారు. . ఎమ్మెల్యేలపై నిఘాలు..ఫోన్ సంభాషణలు దొంగ చాటుగా వినటం పాలకుల అభద్రతా భావాన్ని తెలుపుతోందని పవన్ వ్యాఖ్యానించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి నేరుగా సీఎం, ఆయన కార్యాలయం పైన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తే బాధ్యత కలిగిన డీజీపీ, హోం మంత్రి ఎందుకు మాట్లాడలేదని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.ఆనం రామనారాయణ రెడ్డి చేసిన ప్రాణ హాని ప్రకటన..కోటంరెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యాఖ్యల గురించి ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసారు.
అయితే ఈ ఎపిసోడ్ లో పవన్ సడెన్ గా ఎంట్రీ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిల వెనుక చంద్రబాబు ఉన్నట్టు వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. కోటంరెడ్డి ఇప్పటికే చంద్రబాబు, లోకేష్ లను కలుసుకున్నారని కూడా నేతలు చెప్పుకొస్తున్నారు. టీడీపీ హైకమాండ్ సూచనల మేరకు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేశారని అనుమానిస్తున్నారు. దాదాపు ఈ ఇద్దరు నేతలు టీడీపీలో చేరుతారని భావిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ట్విస్ట్ కలకలం సృష్టిస్తోంది. ఏకంగా ఇద్దరు నాయకులకు మద్దతుగా నిలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే బెదిరింపుల బాధితులుగా మిగిలిన ఇద్దరు నేతలు పవన్ మద్దతుతో స్వాంతన చేకూరింది. అయితే పవన్ ఎంట్రీతో ఆ ఇద్దరు నేతలు జనసేన వైపు వెళతారా? అన్న ప్రశ్న అయితే మొదలైంది.