Pawan Kalyan: పవన్ అన్ని అంశాలపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. బిజెపితో సంబంధాలు, తెలుగుదేశం పార్టీతో పొత్తు, వైసిపి విషయంలో తీసుకున్న స్టాండ్ఇలా అన్ని అంశాలపై స్పష్టతనిచ్చారు.రెండు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీతో కలిసే నడిచే క్రమంలో ఎన్డీఏ నుంచి సైతం బయటకు వచ్చానని పవన్ అన్నట్లు వైసిపి ప్రచారం ప్రారంభించింది. సరిగ్గా జగన్ ఢిల్లీ వెళ్లే సమయంలోనే పవన్ ఎన్డీఏకు గుడ్ బై చెప్పినట్లు ప్రచారం చేశారు. ఈ తరుణంలోనే పవన్ స్పందించారు. తాను ఎన్డీఏకు దూరం కాలేదని తేల్చేశారు. అదే జరిగితే తాను ముందుగా కేంద్ర పెద్దలకు చెబుతానని కూడా చెప్పుకొచ్చారు. తాను ఎప్పుడు ఎన్డీఏకు దూరమవుతానా అని వైసిపి ఎదురుచూస్తుందని పవన్ ఎద్దేవా చేశారు. నేను ఎవరితో కలిస్తే మీకెందుకు? ఎవరికి గుడ్ బై చెప్తే మీకెందుకు? మీరు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని అడగండి అంటూ జగన్కు పవన్ సూచించారు.
జగన్ చేస్తున్న నిర్వాకాలు కేంద్రానికి తెలుసునని పవన్ చెబుతున్నారు. g20 శిఖరాగ్ర సమావేశాలు జరిపే అరుదైన అవకాశం ఇండియాకు వచ్చిన విషయాన్ని పవన్ గుర్తు చేశారు. కానీ ఏపీ ప్రజలకు ఆ శిఖరాగ్ర సమావేశాల ప్రాధాన్యత తెలియనివ్వకుండా జగన్ కుట్ర చేశారని పవన్ ఆరోపించారు. సరిగ్గా అదే సమయంలో చంద్రబాబును అరెస్టు చేసి ఈ రాష్ట్ర ప్రజల మైండ్ ను డైవర్ట్ చేశారని విమర్శించారు. అంతర్జాతీయంగా భారత్ కు అరుదైన గౌరవం దక్కినా.. ఏపీ ప్రజలకు దక్కనీయకుండా చేయడంలో జగన్ పాత్ర ఉందని ఆరోపించారు. కేంద్ర పెద్దలు నిఘా వ్యవస్థ ద్వారా ఏపీలో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారని.. అందులో భాగంగానే ప్రధాని మోదీ అపాయింట్మెంట్ ఇవ్వకుండా జగన్ ను దూరం పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
జగన్ సర్కార్ పతనం అంచున ఉందని.. ఆ పార్టీకివచ్చే ఎన్నికల్లో గుణపాఠం తప్పదని పవన్ హెచ్చరించారు.రాష్ట్రంలో చాలా రకాల సమస్యలు ఉన్నాయని.. వాటిపై కేంద్రంతో పోరాటం చేయాలని పవన్ పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే మీకెందుకు? ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తే మీకెందుకు? రెండు పార్టీల మధ్య పొత్తు విచ్చిన్నానికి ప్రయత్నాలు చేయడం ఎందుకని.. అదంతా ఓటమి భయంతోనే చేస్తున్నారని పవన్ ఎద్దేవా చేశారు. మీరు ఎన్ని కుయుక్తులు పన్నినా జనసేన, టిడిపి కూటమి విజయాన్ని ఆపలేరని పవన్ స్పష్టం చేశారు.
ఇప్పటికీ తాను ఎన్డీఏ భాగస్తుడినేనని పవన్ స్పష్టం చేశారు. బిజెపి ఆధ్వర్యంలో జనసేన, టిడిపి ప్రభుత్వం మీ నియంతృత్వాన్ని అణచివేస్తుందని పవన్ స్పష్టం చేశారు. నేను అసలు ఎన్డీఏకు దూరం కాలేదని.. అలా ప్రచారం చేస్తున్నది వైసీపీయేనని ఆరోపించారు.టిడిపి,జనసేన కూటమితో భారతీయ జనతా పార్టీ సైతం కలిసి వస్తుందని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే జనసేన, టిడిపిల మధ్యసమన్వయానికి ప్రత్యేక కమిటీలను నియమించినట్లు పవన్ వెల్లడించారు. సక్రమంగా ఓట్ల బదలాయింపు జరిపేందుకు రెండు పార్టీల నేతలు సమన్వయంతో వ్యవహరిస్తున్నారని చెప్పుకొచ్చారు. మొత్తానికి అయితే తాను ఎన్డీఏ నుంచి బయటకు రాలేదని పవన్ క్లారిటీ ఇచ్చారు.