Jagan Delhi Tour
Jagan Delhi Tour: ఏపీ సీఎం జగన్ రెండు రోజుల పాటు ఢిల్లీలో బిజీ బిజీగా గడిపారు. కేంద్ర మంత్రులను కలుసుకున్నారు. పలు అంశాలపై చర్చించారు. వినతులు అందించారు. అయితే ప్రధాని మోదీ అపాయింట్మెంట్ లభించలేదు. హోం మంత్రి అమిత్ షా ను కలవగలిగారు. ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన హామీల అమలుపై చర్చించారు. అటు ఏపీ రాజకీయ పరిస్థితులు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. శనివారంతో సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగియనుంది. మధ్యాహ్నం తాడేపల్లి కి చేరుకోనున్నారు.
తాజా పరిస్థితుల్లో ప్రధాని మోదీ అపాయింట్మెంట్ లభించకపోవడం చర్చకు దారితీస్తోంది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలు అందుబాటులో ఉంటారని భావించి సీఎం జగన్ ఢిల్లీ టూర్ ఖరారు అయ్యింది. ఆ ఇద్దరి నేతల అపాయింట్మెంట్లు దొరికాయని వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. కానీ ఒక్క హోం మంత్రి అమిత్ షా ను మాత్రమే జగన్ కలిసి సమస్యలను విన్నవించారు. ప్రధాని మోదీకి కృష్ణా జలాల వివాదం పై లేఖ రాసి.. జగన్ వెనుతిరిగారు.అయితే జగన్కు కలవడం ఇష్టం లేకే ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు కేంద్ర పెద్దలకు తెలుసు. ఎప్పటికప్పుడు నిఘా వర్గాల ద్వారా కేంద్రం సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. అటు కేంద్ర పెద్దలకు చెప్పే చంద్రబాబు అరెస్టు చేశానని జగన్ తో పాటు వైసిపి వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి. దీంతో ఏపీలో రాజకీయ అస్థిరత కల్పించడానికి బిజెపి పూనుకుందన్న విమర్శలు వచ్చాయి. అదే సమయంలో పవన్ సైతం బిజెపికి దూరం కావడానికి జగనే కారణం అన్న ఆరోపణలు ఉన్నాయి. భవిష్యత్తులో ఏపీలో అనుసరించాల్సిన విధానంపై బీజేపీకి ఒక స్పష్టమైన ప్రణాళిక ఉంది. ఎన్నికల ముంగిట ఏ పార్టీ బలంగా ఉంటే ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకోవడం కానీ.. ఒక అవగాహనకు రావడం కానీ చేయాలన్నది బిజెపి అభిప్రాయం. ఈ తరుణంలో న్యూట్రల్ గా ఉండడమే శ్రేయస్కరమని భావిస్తున్నట్లు సమాచారం.
తెలంగాణ ఎన్నికల దృష్ట్యా కృష్ణానది జలాల విషయంలో కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. అది తెలంగాణకు అనుకూలమన్న వాదన వినిపిస్తోంది. కానీ జగన్ ఏం చేయలేని నిస్సహాయత. మరోవైపు కేసీఆర్ తో ఉన్న స్నేహంతో గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. అటు కేంద్రానికి సైతం ఎదురు చెప్పలేకపోతున్నారు. అందుకే ప్రధానికి లేఖ రాసి విమర్శలనుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు.అయితే ఇప్పుడు కెసిఆర్ కు,ఇటు కేంద్ర పెద్దలకు ఉమ్మడి స్నేహితుడిగా జగన్ కొనసాగుతున్నారు.ఇటువంటి సమయంలో జగన్కు అపాయింట్మెంట్ ఇస్తే కచ్చితంగా కృష్ణా జలాల వివాద అంశాన్ని ప్రస్తావిస్తారు.వైసిపి దానిని సానుకూల అంశంగా ప్రచారం చేస్తుంది.తెలంగాణ ఎన్నికల్లో బిజెపికి నష్టం చేకూరుతుంది.అటు ఏపీ రాజకీయ పరిస్థితులు, తెలంగాణ ఎన్నికల దృష్ట్యా జగన్ కు ప్రధాని ముఖం చాటేశారని ప్రచారం బలంగా జరుగుతోంది.