Pawan Kalyan: జనసేనాని పవన్ తెలుగునాట కోట్లాది మంది ప్రజాభిమానం సొంతం చేసుకున్నారు. చిన్న పిల్లల నుంచి పండుటాకుల వరకూ ఆయనకు హార్ట్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. రాజకీయాలంటే బొత్తిగా పడని వారు సైతం పవన్ జనసేన ఆవిర్భావం నుంచి అతడితో అడుగులు వేస్తున్నారు. పవన్ తన చర్యలు, ప్రసంగాలతో విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు. అందుకే పవన్ సినిమా, రాజకీయ రంగాలను సమ ప్రాధాన్యమిస్తున్నారు. క్షణం తీరిక లేకుండా గడిపే పవన్ అభిమానులకే ఎక్కువ సమయాన్నికేటాయిస్తారు. తాజాగా ఆయన ఓ కేన్సర్ బాధితుడికి విలువైన సమయాన్ని వెచ్చించారు. అతడి చివరి కోరికను తీర్చారు. ఇప్పుడు ఆ వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. జనసైనికులు, అభిమానులు విపరీతంగా ట్రోల్ చేసి తమ అభిమాన నాయకుడికి అభినందనలతో ముంచెత్తుతున్నారు.

కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం రామేశ్వరానికి చెందిన సత్తిబాబు పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. ఫ్యాన్స్ అసోసియేషన్ లో యాక్టివ్ గా పనిచేసేవారు. అటు జనసేన ఆవిర్భావం తరువాత పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా పనిచేసేవారు. కానీ దురదృష్టవశాత్తూ ఆయన క్యాన్సర్ బారిన పడ్డారు. కాకినాడ, విజయవాడ, హైదరాబాద్ ల్లో చికిత్స కూడా చేసుకున్నారు. ప్రస్తుతం మంచానికే పరిమితమయ్యారు. తనకు పవన్ తో ఒకసారి కలవాలనుందని.. ఆయనతో ఫొటోలో దిగాలని ఉందని కుటుంబసభ్యులకు చెప్పాడు. వారు జనసేన నాయకులకు చెప్పగా.. వారు పవన్ ను సంప్రదించారు. దీంతో జనసేనాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.దీంతో కాకినాడ నుంచి ప్రత్యేక అంబులెన్స్ లో సత్తిబాబును మంగళగిరి పార్టీ కార్యాలయానికి తెచ్చారు. విషయం తెలుసుకున్న పవన్ కార్యాలయం నుంచి బయటకు వచ్చి సత్తిబాబును పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయనతో ఫొటో దిగి కోరికను నెరవేర్చారు.

ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ అభిమానానికి హ్యాట్సాప్ అంటూ జన సైనికులు, అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. సినీ, రాజకీయ రంగాల్లోక్షణం తీరిక లేకుండా గడుపుతున్న పవన్ కార్యకర్తలు, అభిమానులపై చూపుతున్న ప్రేమ ఇది అంటూ జన సైనికులు సగర్వంగా చెబుతున్నారు. విపరీతమైన స్టార్ డమ్ ను వదులుకొని రాజకీయరంగంలో అడుగుపెట్టిన పవన్ కు ఇది కొత్తకాదు. ఉద్దానం కిడ్నీ బాధితులనే అక్కున చేర్చుకున్నారు. వంశధార నిర్వాసితులకు అండగా నిలబడ్డారు. నిత్యం రాకాసి అలలతో జీవన యుద్ధం చేసే మత్స్యకారులకు భరోసా ఇచ్చారు. బడుగు, బలహీన వర్గాలకు పవన్ ఆలోచనలు, చర్యలు ఎప్పుడూ దగ్గరగానే ఉంటాయని విశ్లేషకులు సైతం తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.