టాలీవుడ్ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళికి ఏమైంది.? సీఎం జగన్ ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్న పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలకు దిగారు. సినీ పరిశ్రమ కష్టాలను ఎండగడితే వాటిపై సమాధానం ఇవ్వకుండా.. సొంత సినీ పరిశ్రమకు మద్దతుగా మాట్లాడిన పవన్ పై వ్యక్తిగత దాడికి దిగాడు పోసాని..
సోమవారం ప్రెస్ మీట్ పెట్టి విమర్శించిన పోసాని మంగళవారం సాయంత్రం సైతం మరోసారి హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. దీన్ని పవన్ ఫ్యాన్స్ అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పవన్ కళ్యాణ్ పై పోసాని వ్యక్తిగత విమర్శలకు నిరసనగా ఆయనపై దాడికి యత్నించారు ఫ్యాన్స్.
ఇక పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలతో రెచ్చిపోయారు పోసాని.. చాలా విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక్కసారిగా పోసాని మీదికి వచ్చి దాడికి యత్నించారు. పోలీసులు అప్రమత్తమై పవన్ ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. తమ అభిమాన నాయకుడిపై వ్యక్తిగత దాడి చేస్తే ఊరుకునేది లేదంటూ హైదరాబాద్ లో పోసానికి తిరిగనివ్వం అంటూ హెచ్చరించారు.
ప్రెస్ మీట్ లో కూడా కొంత మంది విలేకరులు ఇలా పవన్ పై వ్యక్తిగత దాడి చేయడం కరెక్ట్ కాదని పోసానిని ప్రశ్నించారు. కానీ వారిపై కూడా పోసాని విరుచుకుపడ్డారు.తమ అభిమాన నేత జగన్ ను ఏమైనా అంటే ఊరుకోనని చెప్పుకొచ్చాడు. దీంతో పోసాని తనకు సినీ పరిశ్రమ కంటే జగన్ నే ఎక్కువ అని నిరూపించారు.
పవన్ పై పోసాని వ్యక్తిగత విమర్శలపై ఇంటా బయటా విమర్శలు చెలరేగుతున్నాయి. నిర్మాణాత్మక విమర్శలు చేయాలని..కానీ ఇలా పవన్ పై వ్యక్తిగత విమర్శలు వద్దని హితవు పలుకుతున్నారు. పోసానికి ఏమైందని.. ఆయన వెనుక ఎవరున్నారని అందరూ ప్రశ్నిస్తున్నారు. సినీ పరిశ్రమ బాగు కోసం సమస్యలు ఎలుగెత్తి చాటిన పవన్ పై ఇలాంటి దాడి సరికాదంటున్నారు.
ఇక పవన్ ఫ్యాన్స్ నుంచి తనకు ప్రాణహాని ఉందని.. రేపు పోలీస్ స్టేషన్ లో పవన్ పై కేసు పెట్టనున్నట్లు పోసాని విలేకరుల సమావేశం అనంతరం సంచలన ప్రకటన చేశారు. దీంతో ఈ వివాదం మరింత ముదరబోతోంది.