Pawan Kalyan vs Jagan : ఏపీ సీఎం జగన్ విజయాలనే అపజయాలుగా చూపిస్తూ జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై సమరశంకం పూరిస్తున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్లి బాధితుల పక్షాన నేనున్నాంటూ భరోసా కల్పిస్తున్నారు. ఏపీ ఎవరికి అన్యాయం జరిగినా మొదట స్పందించేది పవన్ కళ్యాణ్ అన్న విశ్వాసం బలపడుతోంది. అదే పవన్ ను దగాపడ్డ బాధితులకు దగ్గర చేస్తోంది. ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.
పదోతరగతి విద్యార్థులను వైసీపీ ప్రభుత్వమే ఫెయిల్ చేసిందని జనసేనాని పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. ఇంట్లో తల్లిదండ్రులదే తప్పు అంటూ వాళ్లపై నెపం వేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఫెయిల్ కావడానికి తల్లిదండ్రులే కారణమంటూ వైసీపీ ప్రభుత్వం తమ చేతగానితనాన్ని దాచిపెట్టుకున్నా.. పవన్ కళ్యాణ్ మాత్రం దాన్ని బయటకు తీసి ఇప్పుడు ప్రజల ముందు పెట్టి కడిగేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ విద్యావ్యవస్థలో వారి లోపభూయిష్టమైన విధానాలను చరిత్ర దాచిపెట్టుకోదని పవన్ కళ్యాణ్ అంటున్నారు.
వైసీపీ ప్రభుత్వం ఏపీలో పాఠశాలల రూపురేఖలు మార్చింది. ‘నాడు నేడు’ శిథిలావస్థలో ఉన్న పాఠశాలలను దాదాపు రూ.16వేల కోట్లు వెచ్చించి బాగు చేయించింది. వాటికి మంచి రంగులద్దింది. ఇక ఎవ్వరు వ్యతిరేకించినా ఇంగ్లీష్ మీడియం చదువులను జగన్ ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేశారు. ఇంత ఖర్చు పెట్టినా ఇప్పుడు పదోతరగతి ఫలితాలు దారుణంగా వచ్చాయి. ఏకంగా 30 శాతానికి పైగా విద్యార్థులు ఫెయిల్ కావడం ఏపీ ప్రభుత్వ పాఠశాలల దుస్థితికి అద్దం పట్టింది.
నిజానికి కోట్లు ఖర్చుపెట్టిన జగన్ విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం చెప్పే టీచర్లను రిక్రూట్ చేయలేదు. కనీసం ఒక్క డీఎస్సీ ప్రకటన కూడా ఇవ్వలేదన్నది వాస్తవం. విద్యాప్రణాళిక పటిష్టంగా లేదు. ఉపాధ్యాయులను మద్యం షాపుల వద్ద డ్యూటీలు వేసి వారిని చదువులు చెప్పించకుండా దూరం చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిది. ఉపాధ్యాయులకు మరుగుదొడ్ల నిర్వహణ, మధ్యాహ్నం భోజనం బాధ్యతలు అప్పజెప్పారు.
ఇలా విద్యావ్యవస్థకు కోట్లు వెచ్చించి వాటిని ఎటూ పోయాయో చూడకుండా.. ఉపాధ్యాయులను చదువులనుంచి మళ్లించి వైసీపీ సర్కార్ వాడుకుందని పవన్ కళ్యాణఫ్ ఆరోపించారు. అందుకే పాలకుల పాపమే ఇప్పుడు విద్యార్థుల పాలిట శాపంగా మారిందని అంటున్నారు. ఇప్పుడు ఇంత మంది ఫెయిల్ కావడానికి వైసీపీ ప్రభుత్వమే కారణమని పవన్ కళ్యాణ్ లాజిక్ తో కొట్టారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు 10 గ్రేస్ మార్కులు ఇచ్చి వారి భవిష్యత్తును కాపాడాలంటూ పిలుపునిచ్చారు. సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజులేకుండా నిర్వహించాలని.. రీకౌంటింగ్ ఉచితంగా చేయాలని పవన్ డిమాండ్ చేశారు.
ఇలా బాధితుల పక్షాన.. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పవన్ కల్యాణ్ ముందుకొచ్చి వైసీపీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. వారి తరుఫున పోరాడేందుకు సిద్ధమయ్యారు.జగన్ సర్కార్ ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న విద్యావ్యవస్థలోని లూప్ హోల్ ను పట్టుకొని పవన్ ప్రశ్నిస్తున్నారు. ఆ చదువులతో జగన్ ను కొడుతున్నారు.