
‘‘రాజకీయాలు మహా కాస్ట్లీ అయిపోయాయి’’ అని ఒక సినిమా డైలాగ్. ఇది వాస్తవం అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఏపీలో చూసుకున్నప్పుడు వైసీపీ, టీడీపీకి ఆ ఇబ్బంది లేదు. ఎటొచ్చీ.. ఏ అండా లేకుండా సొంతంగా పార్టీ పెట్టుకున్న పవన్ కల్యాణ్ కే ఇబ్బంది. డబ్బు లేకపోతే పార్టీ కార్యక్రమాల నిర్వహణ అసాధ్యం. దీంతో.. సినిమాలను వదిలేసుకున్న పవన్ అనివార్యంగా తిరిగి ఇండస్ట్రీలో అడుగు పెట్టాల్సి వచ్చింది. రీ-ఎంట్రీలో అదరగొట్టేశారు. వకీల్ సాబ్ ఘన విజయంతో ఊపుమీదున్న పవన్.. వరుస సినిమాలపై దృష్టి పెట్టారు.
ప్రస్తుతం పవన్ కల్యాణ్ ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో హరిహర వీరమల్లు సినిమా కూడా చేస్తున్నారు. ఇవి రెండూ ముగియగానే.. హరీశ్ శంకర్ మూవీ లైన్లో ఉంది. ఆ తర్వాత బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించే సినిమా ఉంది. ఇవన్నీ పూర్తయ్యే సరికి 2023 పూర్తి కావొచ్చు. ఆ తర్వాత ఏడాది ఎన్నికలే. మరి, పవన్ పార్టీని నిర్మించుకునే సమయం ఎక్కడ లభిస్తుంది? రాజకీయాలకు సమయం ఎప్పుడు ఇస్తారు? అన్నది ప్రశ్న.
రెండేళ్లుగా కరోనా రాజకీయాలను సైతం ప్రభావితం చేసింది. అధికార పార్టీతోపాటు విపక్షాలు కూడా కార్యక్రమాలు నిర్వహించుకోలేని పరిస్థితి. దీంతో.. రోడ్డెక్కి ఉద్యమాలు నిర్వహించలేదు ప్రతిపక్షాలు. అయితే.. 2019 ఎన్నికలు ముగిసిన తర్వాత పవన్ పార్టీకి పుల్ స్టాప్ పెట్టొచ్చు అనే చర్చ కూడా సాగింది. కానీ.. తాను పక్కాగా పార్టీని నడిపించడానికి, ప్రజల కోసం పనిచేయడానికే వచ్చానని నిరూపించుకున్నారు పవన్. ఓడిపోయినప్పటికీ.. ప్రజల మధ్యే ఉన్నారు. కానీ.. తిరిగి సినిమాల్లోకి వెళ్లడం వల్ల రాజకీయాలకు పూర్తిగా సమయం కేటాయించలేని పరిస్థితి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రాజకీయ పార్టీగా ప్రజల మన్ననలు పొందాలంటే వారి తరపున పోరాటం చేయాలి. తమకోసమే ఉద్యమిస్తున్నారనే నమ్మకం కలిగించాలి. ఇది జరగాలన్నప్పుడు నిత్యం ప్రజల్లోనే ఉండాలి. కానీ.. పవన్ చేస్తున్న సినిమాలను చూస్తే.. అంత టైమ్ రాజకీయాలకు కేటాయించే పరిస్థితి కనిపించట్లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి, ఈ పరిస్థితిని పవన్ ఎలా మేనేజ్ చేస్తారు? సినిమాలకు, రాజకీయాలకు సమయాన్ని ఎలా సర్దుబాటు చేసుకుంటారు? అన్నది ఆసక్తికరం.