AP Movie Tickets Issue: అఖండ తో మొదలుకొని ఆచార్య వరకు రెండు నెలల వ్యవధిలో టాలీవుడ్ లో భారీ చిత్రాల విడుదల ఉంది. ఈ చిత్రాల విడుదల సమీపిస్తుండగా ఏపీలో టికెట్స్ ధరల పెంపు విషయం ఓ కొలిక్కి రాలేదు. పరిశ్రమ పెద్దలు చిరంజీవి, డి సురేష్ బాబు దీనిపై స్పందించారు. టికెట్స్ ధరల విషయంలో సీఎం జగన్ పునరాలోచించాలి అంటూ అభ్యర్థిస్తున్నారు.

వాస్తవ పరిస్థితులు వివరిస్తూ… తమ వాదన వినిపిస్తున్నారు. ఈ విషయంపై మొదట స్పందించిన పవన్ కళ్యాణ్ ఇంకా నోరు మెదపకపోవడం ఆశ్చర్యంగా ఉంది. టికెట్స్ ధరలు, ఆన్లైన్ విధానానికి వ్యతిరేకంగా మొదట ధ్వజమెత్తింది పవన్ కల్యాణే. రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో సీఎం జగన్, ఏపీ మంత్రులను ఉద్దేశిస్తూ పవన్ చేసిన ఘాటు వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి.
పవన్ స్పీచ్ అనంతరం పెద్ద హైడ్రామా నడిచింది. మంత్రి పేర్ని నాని మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ కి కౌంటర్ ఇచ్చారు. ఆయన కూడా పవన్ ని ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆన్లైన్ లో ప్రభుత్వ పోర్టల్ ద్వారా టికెట్స్ అమ్మడాన్ని పవన్ ప్రధానంగా తప్పుబట్టారు. ప్రైవేట్ వ్యక్తులు నిర్మించే సినిమాలపై ప్రభుత్వ పెత్తనం ఏమిటని ప్రశ్నించారు.
Also Read: సినిమా టికెట్ల వ్యవహారంపై ప్రభుత్వ నిర్ణయం సమంజసమేనా?
ఈ వివాదం జరిగి రెండు నెలలు అవుతుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలలో సినిమాటోగ్రఫీ చట్టంలో మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. టికెట్స్ ధరలు నియంత్రించడం తో పాటు బెనిఫిట్ షోల రద్దు, బడ్జెట్ తో సంబంధం లేకుండా అన్ని సినిమాలకు ఒకే టికెట్ ధర, ఆన్లైన్ లో టికెట్స్ అమ్మకాలు వంటి కొత్త ప్రతిపాదనలు చట్టంలో పొందుపరిచారు.

జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై పవన్ ఇంకా నోరు మెదపలేదు. ఆయన వైఖరి ఏమిటో తెలియజేయలేదు. కనీసం సోషల్ మీడియాలో కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. పవన్ మౌనం వెనుక ఇండస్ట్రీ పెద్దల ఒత్తిడి కూడా ఉండవచ్చు. పవన్ పై కోపంతోనే సీఎం జగన్ పరిశ్రమను ఇబ్బంది పెడుతున్నాడన్న అనధికారిక వాదన ఒకటి ఉంది.
Also Read: సినిమా కష్టాలన్నీ ప్రభుత్వం పట్టించుకోక్కర్లేదు !
పవన్ మరోసారి సీఎం జగన్ ని ఉద్దేశించి ఆవేశపూరిత వ్యాఖ్యలు చేస్తే… ఆయన మరింత మొండిగా వ్యవహరించే అవకాశం కలదని, దాని వలన కనీసం చర్చల ద్వారా ప్రసన్నం చేసుకునే మార్గం కూడా మూసుకుపోతుందని భావించి ఉండవచ్చు. ఇప్పటికే పలుమార్లు సినీ పెద్దలు ప్రభుత్వంతో చర్చలు జరిపినా ఎటువంటి ప్రయోజనం దక్కలేదు.