Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు? సొంత నియోజకవర్గం భీమవరం నుంచా? లేకుంటే గాజువాక నుంచా? లేకుంటే కొత్త నియోజకవర్గ నుంచా? పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. కానీ జనసేన నుంచి ఇంతవరకు ఎటువంటి స్పష్టత లేదు. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండడంతో సీట్ల సర్దుబాటు విషయం మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు వస్తాయి? ఎక్కడ బరిలో దిగితే బాగుంటుంది? అన్న ఖచ్చితమైన నిర్ణయం వచ్చిన తర్వాతే పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్నదానిపై క్లారిటీ రానుంది. అయితే ఇంతలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.
తాజాగా పవన్ కాకినాడ వేదికగా గోదావరి జిల్లాల్లో పార్టీపై సమీక్షలు ప్రారంభించారు. మూడు రోజులపాటు ఆయన కాకినాడలోనే ఉండనున్నారు. నియోజకవర్గాల వారీగా రివ్యూలు జరపనున్నారు. ఈ నేపథ్యంలో ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకు వచ్చింది. పవన్ కాకినాడ సిటీ నుంచి పోటీ చేస్తారన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఈసారి తన గెలుపు ఓ రేంజ్ లో ఉండాలని పవన్ భావిస్తున్నారు. అది కూడా తనతో సవాల్ చేసిన వ్యక్తి.. తాను సవాల్ చేసిన వ్యక్తి పైనే ఉండాలనుకొని అనుకుంటున్నారు. ఆ క్రమంలోనే ఆయన దృష్టిలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. ఆయన సీఎం జగన్ కు నమ్మిన బంటు. కాకినాడ సిటీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్నారు. ఆయన గతంలో పవన్ పై వ్యక్తిగతంగా విరుచుకుపడ్డారు. అనుచిత వ్యాఖ్యలు చేశారు. కానీ ఆ స్థాయిలో పవన్ విరుచుకు పడితే తన స్థాయి దిగజారుతుందని ఒక అడుగు వెనక్కి వేశారు. కానీ ఎన్నికల్లో మట్టి కరిపించి ద్వారంపూడి కి సరైన సమాధానం చెప్పాలని పవన్ భావిస్తున్నారు.
వైసీపీ నేతలు నోరు తెరిస్తే రెండు చోట్ల ఓడిపోయాడు.. ఆయన ఒక నేతేనా? అని రకరకాల కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. దీనికి చెక్ చెప్పాలంటే..వచ్చే ఎన్నికల్లో మైండ్ బ్లాక్ అయ్యేలా విజయం అందుకోవాలని పవన్ భావిస్తున్నారు. అన్ని రకాల సర్వే నివేదికలను పరిశీలించిన తర్వాత కాకినాడ సిటీ శ్రేయస్కరమని తేలింది. పైగా అక్కడ తాను అనుకుంటున్న లక్షణాలు కలిగిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. ఆయనకు ఓటమి రుచి చూపించి.. జగన్ ను దెబ్బతీయాలని పవన్ ఆలోచన చేస్తున్నారు. కాకినాడ సిటీ నుంచి పోటీ చేయడానికి పవన్ దాదాపు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఉభయ గోదావరి జిల్లాల్లోకూటమికి ఒక ఊపు వస్తుందని భావిస్తున్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ని దెబ్బ కొడితే… అది జగన్ రెడ్డికి తగులుతుందని ఒక అంచనాకు వచ్చారు. అందుకే పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. మూడు రోజులపాటు అక్కడే ఉండి దిశా నిర్దేశం చేయనున్నారు. అయితే ఇంకా సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి రాకపోవడంతో బయటకు వ్యక్తం చేసేందుకు ఇష్టపడడం లేదు. అయితే కాకినాడ సిటీ పార్టీ శ్రేణులకు మాత్రం ఒక రకమైన సంకేతం అందినట్లు తెలుస్తోంది. అధినేతను గెలిపించుకునేందుకు.. భారీ మెజారిటీ కట్టబెట్టేందుకు వారు వ్యూహాలు రూపొందించుకుంటున్నట్లు సమాచారం.