Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ విధి విధానాలు మిగతా పార్టీల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. ఆయన చెప్పే మాటలు చాలా వరకు చైతన్య వంతంగానే ఉంటాయి. ఈ విషయంలో ప్రతిపక్షాలు కూడా ఎక్కువగా ఆయన్ను విమర్శించవు. అందుకే ఆయన్ను అభిమానులు అమితంగా అభిమానిస్తుంటారు. అయితే నిన్న నరసాపురంలో మత్స్యకార అభ్యున్నతి సభ నిర్వహించింది జనసేన పార్టీ. ఇందులో భాగంగా పవన్ అనేక విషయాల్లో స్పందించారు.
ముఖ్యంగా కులం, సంస్కారం విషయంలో ఆయన ప్రసంగం ఎక్కువగా సాగింది. తాను ఒక కులాన్ని మోసే వ్యక్తిని కాదని, అలా అయితే గతంలో టీడీపీకి ఎందుకు సపోర్టు చేస్తానంటూ ప్రశ్నించారు. అంతే కాకుండా వైసీపీ కావాలనే తన మీద కులం ముద్ర వేయడానికి ప్రయత్నిస్తోందన్నారు. రాజకీయాల్లో అన్ని పార్టీలు కులాలను విడదీయకుండా.. కులాలను కలుపుకుని పోయేలా విధానాలను పాటించాలంటూ విజ్ఞప్తి చేశారు.
Also Read: కేసీఆర్ టీమ్‌లో ప్రకాశ్ రాజ్.. ఏందీ విలక్షణ రాజకీయం..?
ఇదే సమయంలో తన అభిమానులకు కూడా కొన్ని సూచనలు చేశారు. ఇంకా చెప్పాలంటే.. క్లాస్ పీకారనే చెప్పుకోవచ్చు. అరుపులు, కేకలతో అధికారం రాదని, సంయమనం పాటించాలని, పెద్దలకు గౌరవం ఇవ్వాలని చెప్పారు. ఇతర పార్టీలు మనల్ని విమర్శించేలా ఉండకూడదని, అందరూ మనల్ని గౌరవించేలా మీ ప్రవర్తన ఉండాలని సూచించారు. బాధ్యతగా మెలగాలంటూ కోరారు.
అంతే కాకుండా అందరూ ఓట్లు రిజిస్టర్ చేయించుకోవాలంటూ కోరారు. ఈ విషయంలో తన మాటను ఎవరూ కాదనొద్దని విజ్ఞప్తి చేశారు. అయితే పవన్ ఇలా క్లాస్ తీసుకోవడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటి నుంచే తన వారందరినీ తన దారిలో పెట్టుకుంటున్నారని అంటున్నారు విశ్లేషకులు. అరుపులు కేకలు వద్దని చెప్పడం వెనకాల తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు పవన్.
ఇతరులకు గౌరవం ఇవ్వాలని కోరడం వెనకాల.. ప్రజల్లో తన గౌరవం పెరగాలనే భావన ఉందంటున్నారు. పవన్ అంటే సంస్కారం కలిగిన వ్యక్తి అని, మహిళలకు, పెద్దలకు అమితంగా గౌరవం ఇచ్చే మనిషిగా ప్రజల్లో ముద్ర వేసుకోవాలన్నది పవన్ ఆరాటం. అదే జరిగితే ప్రజలు తనకు మద్దతుగా నిలబడే ఛాన్స్ ఉందని పవన్ అనుకుంటున్నారు.
Also Read: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంత తగ్గాయాంటే?