Nara Lokesh
Nara Lokesh: ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొలది రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థుల మార్పుపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే 11 మంది అభ్యర్థులను మార్చింది. మరో 80 మందికి మార్పు తప్పదని వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో టిడిపి, జనసేన ఉమ్మడి కార్యాచరణ ప్రారంభమైంది. లోకేష్ పాదయాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అది సక్సెస్ కావడంతో మరో రెండు సభలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రారంభమైన నేపథ్యంలో సీఎం పదవి విషయంలో లోకేష్ ప్రకటనతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది.
జనసేన ఆవిర్భవించి సుదీర్ఘకాలమవుతోంది. కానీ ఇంతవరకు ఆ పార్టీకి చెప్పుకోదగ్గ విజయం దక్కలేదు. అందుకే ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని సీట్లను గణనీయంగా పెంచుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. తమ అధినేత పవన్ ను ఎప్పటికైనా సీఎం సీట్లో చూడాలని జనసేన హార్డ్ కోర్ ఫ్యాన్స్ కోరుతుంటారు. టిడిపి, జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబుతో పాటు పవన్ కు పవర్ షేరింగ్ కావాలని బలంగా కోరుతున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. సీట్ల షేరింగ్ వర్క్ ఓకే కానీ.. పవర్ షేరింగ్ విషయానికి వచ్చేసరికి మాత్రం ఆ పార్టీ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది జనసేనకు మింగుడు పడని విషయం.
చంద్రబాబు అవినీతి కేసుల్లో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో 52 రోజులు పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సరిగ్గా అటువంటి సమయంలోనే చంద్రబాబును పరామర్శించిన పవన్ పొత్తు ప్రకటన చేశారు. తెలుగుదేశం పార్టీతో కలిసి నడుస్తానని సంచలన ప్రకటన చేశారు.దీంతో పవర్ షేరింగ్ కావాలని జనసేన పార్టీ శ్రేణుల నుంచి బలమైన వాదన వినిపించింది. అయితే సీట్లు ఎక్కువగా ఇస్తేనే తాను సీఎం అవుతానని.. ప్రజలు బలంగా కోరుకుంటే ఆ పదవిలో కూర్చుంటానని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. అయితే పొత్తులో భాగంగా జనసేనకు 27 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్ సభ స్థానాలు ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ మొగ్గు చూపినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ సీట్లతో పవర్ స్టీరింగ్ సాధ్యమేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే లోకేష్ కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ప్రముఖ జర్నలిస్టు జాఫర్ లోకేష్ ను తాజాగా ఇంటర్వ్యూ చేశారు. జనసేనతో పొత్తు వ్యవహారాలను ప్రస్తావించారు. టిడిపి, జనసేన కూటమి అధికారంలోకి వస్తే పవన్ కు పవర్ షేరింగ్ ఇస్తారా?లేదా? అని ప్రశ్నించారు. సూటిగా సమాధానం చెప్పాలని కోరారు. కూటమి అధికారంలోకి వస్తే సీఎం గా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తారని.. పూర్తిస్థాయిలో ఆయనే అధికారం చేపడతారని.. ఇందులో మూడో మాటకు తావు లేదని.. పవన్ సైతం సీనియారిటీకి పెద్ద పీట వేస్తారని లోకేష్ తేల్చి చెప్పారు. దీంతో సీఎం అభ్యర్థిత్వం విషయం ఫుల్ క్లారిటీ వచ్చినట్టు అయింది. అయితే పవన్ ను సీఎం గా చూడాలని జనసేన అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ఇప్పుడు లోకేష్ ఫుల్ క్లారిటీ ఇవ్వడంతో ఎలా స్పందిస్తారో చూడాలి.
సీఎం సీటు పై నారా లోకేష్ క్లారిటీ..పవన్ కళ్యాణ్ కు లేదని స్పష్టం..!! pic.twitter.com/hygUILYJ0e
— oneindiatelugu (@oneindiatelugu) December 21, 2023