Y. S. Avinash Reddy: బాబాయ్ వివేకా హత్య కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు సీబీఐ శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. అరెస్టు కాకుండా కోర్టులను ఆశ్రయిస్తూ ఎప్పటికప్పుడు ఆయన తప్పించుకుంటూ వస్తున్నారు. ఏ పాపం తెలీదని ఆయన అంటున్నా, సీబీఐ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఈ విషయంలో ఇప్పటికప్పుడే ఆదేశాలివ్వమలేమి కోర్టు కూడా చేతులెత్తేసింది. ముందస్తు బెయిల్ ను తిరస్కరించింది. ఈ నేపథ్యంలో సీబీఐ ఏం చేయబోతుందనేది హాట్ టాపిగ్గా మారింది.
అవినాష్ రెడ్డి అరెస్టు చుట్టూనే హత్య కేసు విచారణ తిరుగుతుండటం గమనించదగ్గ విషయం. ఇప్పటికే ఐదుసార్లు సీబీఐ విచారణకు ఆయన హాజరయ్యారు. ప్రతీసారి అరెస్టు చేస్తారనే పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల జగన్ ఆకస్మికంగా ఢిల్లీ పర్యటన వివాదాంశంగా మారింది. తమ్ముడు అవినాష్ ను కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. తాత్కాలికంగా ఉపశమనం కలుగుతున్నా, అవినాష్ అరెస్టు అయితేనే నిజానిజాలు వెలుగులోకి వస్తాయని సీబీఐ గట్టిగా వాదిస్తోంది. ఇదే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువస్తుంది. విచారణకు పూర్తి స్థాయిలో సహకరించడం లేదన్నది సీబీఐ అధికారుల వాదన ఇందుకు బలం చేకూరుస్తుంది.
మరోవైపు అవినాష్ రెడ్డి మధ్యంతర బెయిల్ ను తెలంగాణ హై కోర్టు తిరస్కరించింది. వాదనలు వినాలని కోర్టుకు ఒత్తిడి తీసుకురావద్దని సూచించింది. అత్యవసరమైతే వెకేషన్ బెంచ్ కు వెళ్లాలని తెలిపింది. శనివారం నుంచి హై కోర్టుకు సెలవుల నేపథ్యంలో ఆవినాష్ రెడ్డి తరుపు న్యాయవాది విన్నపాన్ని సున్నితంగా తిరస్కరించింది. బెయిల్ తీర్పును రిజర్వ్ చేయలేమని తేల్చి చెప్పింది. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో తాము కలుగజేసుకోలేమని స్పష్టం చేసింది. నిర్ణయం వాయిదా వేసి అవినాష్ రెడ్డి అరెస్టుకు మార్గం సుగమం చేశారు. దీంతో ఆయన తరుపు న్యాయవాదులు వెకేషన్ బెంచ్ కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
కాగా, బెయిల్ ను ఏకంగా సుప్రీం కోర్టు కొట్టేయండంతో, అరెస్టుకు లైన్ క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులోని నిందితులను ఇప్పటికే సీబీఐ అధికారులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వీరిలో ఎర్ర గంగిరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ లతో భాస్కర్ రెడ్డి కూడా ఉన్నారు. కోర్టు తదుపరి విచారణను జూన్ 2 వరకు వాయిదా వేశారు. సుప్రీం కోర్టు జూన్ 30 లోగా కేసును పూర్తి చేయాలని ఆదేశాలిచ్చింది. దీంతో త్వరిగతిన పూర్తి చేసేందుకు సీబీఐ వడివడివగా అడుగులేస్తుంది. అవినాష్ రెడ్డి అరెస్టుకు ఏ విధమైన అడ్డంకుల్లేకపోవడంతో, ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా అవినాష్ రెడ్డి అరెస్టు చుట్టూనే కేసు విచారణ ఉండటం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన అరెస్టుతో కేసు కొలిక్కి వస్తుందా? లేక మరిన్ని ట్విస్టులు ఉంటాయా? అనేది వేచి చూడాల్సిందే.