Homeజాతీయ వార్తలుPatriotism: దేశంలో దేశభక్తే ఇప్పుడు రాజకీయ సరుకు..

Patriotism: దేశంలో దేశభక్తే ఇప్పుడు రాజకీయ సరుకు..

Patriotism: దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు గడుస్తోంది. ఎందరో మహానుభావుల పోరాట ఫలితమే మన ఈ స్వేచ్ఛ. అయితే ఇప్పుడు కొత్తగా ‘దేశభక్తి’ అనే అంశం తెరపైకి రావడం మన అదృష్టమో.. దురదృష్టమో తెలియడం లేదు. స్వాతంత్రం వచ్చి 75 వసంతలు పూర్తయిన వేళ అజాదీ కా అమృత్ మహోత్సవాల పేరిట కేంద్ర ప్రభుత్వం వేడుకలకు పిలుపునిచ్చింది. అటు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం మహోన్నత వేడుకలకు మేము సైతం అని నడుం బిగించాయి. రాజకీయంగా బీజేపీని విభేదించే రాష్ట్రాలు సైతం పేరు మార్చి వేడుకలకు పిలుపునివ్వడం సంతోషించదగ్గ విషయం.కానీ అందులో కూడా తమ రాజకీయ ముద్ర కనిపించాలని పరితపించడం కనిపిస్తోంది. స్వయంగా తామే కార్యక్రమాలను రూపకల్పన చేసి అమలుచేస్తున్నారు. ప్రతీ ఇంటా జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికీ జెండాలను పంపిణీ చేశారు. జెండా ఎగుర వేస్తున్నారు. ఆగస్టు మూడో వారం వరకూ జెండా ఆవిష్కరణ, ఇతరత్రా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇన్నాళ్లూ లేని ఈ కొత్త పంథా ఇప్పుడే ఎందుకు అన్న ప్రశ్న అయితే ఉత్పన్నమవుతోంది. జాతీయ జెండా చేత పట్టుకోవడం, ఇంటిపై జెండా ఎగురవేయడమే నిజమైన దేశభక్తిగా ఇప్పుడు మన పాలకులు అభివర్ణిస్తున్నారు. దేశభక్తి అనే దాని అర్థం మార్చేస్తున్నారు. ఇప్పటివరకూ ఎందరో మహానుభావులు దేశభక్తి గురించి ఎన్నో నిర్వచనలు ఇచ్చారు. అవేవీ దేశభక్తిని ఫరిడవిల్లించేవి కాదన్నట్టు ఇప్పుడు దేశభక్తి ముసుగున రాజకీయ క్రీనీడను ప్రారంభించారు. అయితే దీని మూలంగా ఇప్పుడు దేశ వ్యాప్తంగా కొత్త చర్చ అయితే ప్రారంభమైంది. దేశం కోసం ప్రజలు ఏంచేయాలి? పాలకులు ఏంచేయాలి? అన్న ప్రశ్న ఒక్కటి పురుడు పోసుకుంది.

Patriotism
Patriotism

జాతీయ జెండా ఊపడమే దేశభక్తా?
దేశభక్తి అంటే దేశాన్ని మెరుగ్గా తీర్చదిద్దడం. దేశ ప్రజల అభిష్టానికి అనుగుణంగా పాలన అందించడం, దేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలపడం.దేశ ఐక్యతను చాటడం. కానీ ఇవేవీ కాకుండా దేశభక్తి అనేది జెండా ఊపడంలోనే ఉంటుంది అనేది మాత్రం సహేతుకం కాదు.దేశభక్తి అనేది నినాదం కానేకాదు. రాజకీయ స్వలాభం కోసం రగిల్చే భావోద్వేగం అంతకంటే కాదు. ఎన్నికల లబ్ధి కోసం వినియోగించే ముడి సరుకు అంతకంటే కాదు. జన్మభూమిపై అంతులేని ప్రేమచూపడానికి ఒక కథా వస్తువు.భరత మాతపై పుత్రుడి వాత్సల్యానికి, జన్మభూమిపై తండ్రి మమకారానికి ప్రతీకే దేశభక్తి.దీనికి ఎన్ని నిర్వచనాలైనా సరిపోవు. 150 సంవత్సరాల కిందట బ్రిటన్ కు చెందిన జేమ్స్ బ్రిస్ అనే పెద్దాయన చెప్పిన మాటలను అనువదిస్తూ మన తెలుగు వైతాళికులు ఎన్నో సూచనలిచ్చారు. ‘దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్’ అన్న గురజాడ వ్యాఖ్యాల్లో ఎన్నో నిగూడార్థాలున్నాయి. దానిని ఒక్క మాటలో చెప్పాలంటే ‘నువ్వు..నేను,.మనం.. అంతా భారతీయులం’ అనేదే ఆ వైతాళికుడు చెప్పిన మాట. మానవత్వమే దేశభక్తి అని చాటిచెప్పారు మహాత్మగాంధీ. ఆ మహనీయులు నిస్వార్థంతో, నిష్టతో చెప్పిన మాటలు ఆచంద్రార్కంగా నిలుస్తాయి. కానీ మధ్యలో దేశభక్తిని రాజకీయ ముడిసరుకుగా మార్చడానికి చూడడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజలపై ఇదే ఎమోషనల్ అంశంగా.. బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయడం మాత్రం విస్తుగొల్పుతోంది. తాము చెప్పినట్టు చేయకపోతే మీరు దేశద్రోహులు, దేశభక్తి లేని వారు అంటూ ముద్ర వేయాలని చూడడం మాత్రం బాధాకరం.

కొనసాగుతున్న ఆర్థిక అంతరాలు..
ఆర్థిక అంతరాలు లేని భారతదేశం చూడడం సాధ్యమేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. స్వాతంత్రం సిద్ధించి 75 ఏళ్లు గడుస్తోంది. మరో 75 ఏళ్లు గడిచినా త్యాగధనుల కలలుకన్న స్వరాజ్యం సాధ్యమేనా అన్న ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. ఆర్థిక అంతరం విభజించి జీవనం సాగిస్తున్నాం. ప్రభుత్వం పాలన సాగిస్తోంది. పేద, మధ్యతరగతి, ధనిక వర్గాలుగా విభజించి సంక్షేమ ఫలాలను అందిస్తోంది. తొలినాళ్ల నుంచి ఇప్పటివరకూ అదే పంథా కొనసాగుతోంది. దానికి ఫుల్ స్టాప్ మాత్రం పడడం లేదు. సకల సౌకర్యాలతో గడిపే వర్గం ఒకటి ఉండగా.. కూడు, గూడు, గుడ్డ లేని మరోవర్గం కొనసాగుతోంది. పేదరికంలో అభివృద్ది చెందుతున్నారే తప్ప..దాని నుంచి బయటపడలేకపోతున్నారు. దేశ వ్యాప్తంగా 15 కోట్ల మంది బడిఈడు గల పిల్లలు చదువుకు దూరంగా ఉంటున్నారు. మరో 25 కోట్ల మంది అక్షరాలకు దూరంగా ఉన్నారని స్వయంగా కేంద్ర ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. 75 సంవత్సరాల స్వేచ్ఛావనిలో మనం సాధించింది ఇదేనా అని సగటు భారతీయుడు ప్రశ్నించుకోవాల్సిన తరుణం ఇది. మన పాలన ఏ విధంగా ఉంది? సంక్షేమ ఫలాలు కింది వరకూ అందుతున్నాయా? నాయకులు సుపరిపాలన అందిస్తున్నారా? యంత్రాంగం తమ కర్తవ్యాన్ని సజావుగా పూర్తిచేస్తుందా? అన్న ప్రశ్నలను మదిలోకి తెచ్చుకోవాల్సిన కీలక సమయం ఇది.

Patriotism
Patriotism

పరాయి దేశాభివృద్ధికి మన ప్రతిభ…
అయితే ఈ పరిస్థితికి పాలకులు ఎంత కారకులో.. అటు ప్రజలు కూడా అంతే కారకులు. మన చదువు పరాయి దేశ అభివృద్దికి పనికొస్తోంది. అక్కడి ఆర్థికాభిృద్దికి దోహదపడుతోంది.13 కోట్ల మంది భారతీయులు తమ ప్రతిభాపాటవాళ్లను విదేశీ గెడ్డపై ప్రదర్శిస్తున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. మన దేశంలో కూడా అటువంటి పరిస్థితులు, ఉపాధి అవకాశాలు ఉంటే వారెందుకు పరాయి దేశానికి వెళ్లాల్సి వస్తుంది. వాళ్లందరికీ దేశంపై భక్తి లేక కాదు. స్థానికంగా ఉపాధి లేకే విదేశీ బాట పడుతున్నారు. వారి ప్రతిభకు తగ్గ ప్రయోజనం లేకే అటువైపుగా వెంపర్లాడుతున్నారు. 75 ఏళ్లు గడుస్తున్నా వారిని ఎందుకు స్వదేశాలకు తేలేకపోతున్నాం. అక్కడి ప్రయోజనాలను ఇక్కడ ఎందుకు చూపలేకపోతున్నాం? అటు కుబేరులు సైతం దేశంలో ఉండడానికి ఇష్టపడడం లేదు. విలువైన ఆస్తులను వదిలి విదేశాల్లో షటిలవుతున్నారు.ఇక్కడ ఆస్తులు ఉన్నా రాబడి తక్కువ. అందుకే అక్కడ కష్టపడి బతుకుబండి లాగేస్తున్నారు.ఒక విధంగా చెప్పాలంటే మన దేశం కంటే ఎక్కువ ఆదాయం. స్వేచ్చా ఎక్కువే. ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడ బతకనిస్తారు. బతుకుకు భరోసానిస్తారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలవుతున్నా ఇక్కడ మాత్రం మన పాలకులు ఆ పరిస్థితిని కల్పించలేకపోతున్నారు.

బలవంతపు రుద్దడాలు తగునా?
మన దేశంలో ఎవరు ఏ తిండి తినాలి? ఏ బట్ట కట్టాలి? అనేది శాసించే స్థాయికి దిగడం శాపంగా మారుతోంది. భిన్నత్వంలో ఏకత్వం మన భారతదేశం. విభిన్న జాతులు, విభిన్న కులాలు, విభిన్న సంస్కృతులు, సంప్రదాయాల మానవహారం మన దేశం. ఎన్నోవర్గాల ప్రజలు భారతదేశంలో నివసిస్తున్నారు. వారి ఆహార అలవాట్లు, కట్టుబొట్లు వేరుగా ఉంటాయి. కానీ వారి ఆహార నియమాలు బట్టి వారు దేశభక్తులు కారా? అవుననే నిర్థారణకు రావడం మూర్ఖత్వమే అవుతుంది. ఆవు మాంసం తిన్నవాడిలో దేశభక్తి లేదనడం కరెక్టు కాదు.ఒకే దేశం, ఒకే జాతి, ఒకే మతం, ఒకే భాష, ఒకే తిండి అనేది ఏకత్వం కాదు. ఇది దేశభక్తికే విఘాతం. భారతదేశాన్ని మాతృదేశంగా అభివర్ణిస్తాం. దేశమాతగా ఆరాధిస్తాం.జాతీయ పక్షి, జాతీయ జంతువు వంటి చిహ్నాలు దేశభక్తిని ఫరిడవిల్లించేవే. కానీ ఇవేవీ కాకుండా దేశభక్తి మాటున రాజకీయ ఆధిపత్యం, లాభాపేక్షను చూడడం మాత్రం దురదృష్టకరం. హేయం. దేశాన్ని గాడిలోపెట్టాల్సిన నాయకులే క్రీనీడకు దిగడం బాధాకరం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version